చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

చర్లపల్లి టెర్మినల్ ను మరో నెలలో అందుబాటులోకి తీసుకొస్తామని, అమృత్ పథకం కింద అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-20 06:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చర్లపల్లి టెర్మినల్ ను మరో నెలలో అందుబాటులోకి తీసుకొస్తామని, అమృత్ పథకం కింద అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ చర్లపల్లి లో పర్యటించిన ఆయన.. చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చర్లపల్లి టెర్మినల్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, తర్వలోనే ఈ స్టేషన్ ను ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ కు రోడ్డు వే ను పెంచాల్సి ఉందని గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాలు రాస్తే ఎటువంటి స్పందన రాలేదని, ఈ ముఖ్యమంత్రి ఐనా వేగంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. రైల్వే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మోడీ ప్రవేశపెట్టిన కవచ్ అనే ప్రాజెక్టును తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రవేశ పెట్టామని, దానితో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఇక వందే భారత్ రైళ్లు ఢిల్లీ తర్వాత సికింద్రాబాద్ నుంచే ఎక్కువగా నడుస్తున్నాయని, ఇవి మరింత పెంచాలని కోరినట్లు తెలిపారు. అలాగే వీటిలో స్లీపర్ కోచ్ లు ఏర్పాటు చేసే విధంగా చూస్తామని అన్నారు. ఇక తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, అమృత్ పథకం కింద వీటి అభివృద్దిని పూర్తి చేస్తామని తెలిపారు.

యాదాద్రి, కొమురవెల్లికి ప్రత్యేక రైళ్లు

ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు మోడీ వచ్చి భూమి పూజ చేశారని. ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, దీనిని 2025 డిసెంబర్ లోపు మోడీ జాతికి అంకితం చేస్తారని అన్నారు. అలాగే 521 కోట్లతో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కాజీపేటలో ప్రారంభించుకున్నామని, అది పూర్తి అయితే రైల్వే వ్యాగన్లు, కోచ్ లు, ఇంజిన్లు ఇక్కడే తయారవుతాయని అన్నారు. ఇక యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగిస్తామని, దీనికి టెండర్లు పూర్తి అయ్యాయని, నిర్మాణ పనులు తర్వలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే కొమురవెల్లి మల్లన్న దేవాలయ సమీపంలో నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుందని, అది కూడా పూర్తి అయితే యాదాద్రికి. కొమురవెల్లికి ప్రత్యేక ట్రైన్లు నడుస్తాయని చెప్పారు. తెలంగాణలో అన్నీ రైల్వే స్టేషన్లలో సీసీ టీవీల ఏర్పాటు, హైస్పీడ్ వైఫై ఫెసిలిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం "వన్ స్టేషన్ వన్ ప్రొడక్స్" ద్వారా వివిధ స్టేషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేశామని, అన్నీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News