కల్వకుంట్ల కుటుంబం వల్ల తెలంగాణ పరువు పోతోంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని.. రిపబ్లిక్ డే వేడుకలను సైతం రద్దు చేసే పరిస్థితికి ఆయన చేరుకున్నారని మండిపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని.. రిపబ్లిక్ డే వేడుకలను సైతం రద్దు చేసే పరిస్థితికి ఆయన చేరుకున్నారని మండిపడ్డారు. అనేక ఏళ్లుగా పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. కానీ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ సర్కార్ కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం వద్ద అందరు సీఎంలకు ఉండే విధానమే కేసీఆర్‌కు కూడా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఏ సీఎం కూడా ఇలా వ్యవహరించలేదని విమర్శించారు.
అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం అన్ని రాష్ట్రాల్లో ఉందని.. కానీ తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌వి దుర్మార్గపు ఆలోచనలు, వితండవాదం, నిజాం ఆలోచన అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను సీఎం కేసీఆర్ భ్రష్టు పటిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి దేశ ప్రధాని వస్తే కనీస గౌరవం చూపరని.. కల్వకుంట్ల కుటుంబం కారణంగా తెలంగాణ పరువు పోతోందన్నారు. అధికారం కోసం కేసీఆర్ కుటంబం పరితపిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాల పట్ల తెలంగాణ సర్కార్ తీరు సరిగ్గా లేదని.. కనీస గౌరవ, మర్యాదలు పాటించాలని సూచించారు. తెలంగాణ సర్కార్ తీరును ఖండిస్తున్నామని పేర్కొన్నారు.