TRSకు భవిష్యత్ మీద క్లారిటీ వచ్చింది: Kishan Reddy
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కేసీఆర్‌పై బండి సంజయ్ ఘాటు విమర్శలు చేస్తుంటే తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తోంది కేసీఆర్ ప్రభుత్వం కాదని, ఫామ్‌హౌస్ ప్రభుత్వమని, ఫ్యామిలీ ప్రభుత్వమని విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిన సమయంలో ప్రధాని మోడీపై విషం చిమ్ముతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌కు ముచ్చెమటలు పట్టించామని, హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించామని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. మునుగోడులో ఉపఎన్నికల షెడ్యూలు రాకముందే టీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నట్లుంది, అందుకే మళ్ళీ ప్రధాని మోడీ గారిపై విషం చిమ్ముతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగాలు చేసి టీఆర్‌ఎస్‌కు అధికారాన్ని అప్పజెప్పింది ప్రజల జీవితాలను మార్చటానికా లేదా ప్రధానిపై అనవసరంగా విషం చిమ్మటానికా? అంటూ ప్రశ్నించారు.
ఎనిమిది సంవత్సరాల టీఆర్‌ఎస్ పాలనలో ఏం జరిగిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కూలగొట్టిన సచివాలయం, విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు పడుతున్న కష్టాలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, పంట కొనుగోలు జరగక రైతులు చేసుకున్న ఆత్మహత్యలు, నష్టపరిహారం అడిగిన రైతుల చేతులకు సంకెళ్ళు, పెరిగిన నిత్యావసర ధరలు, వరదసహాయం అందక అవస్థలు పడుతున్న కుటుంబాలు, మునిగిపోయిన కాళేశ్వరం పంపుహౌసులు, లెక్కలేకుండా వృథా చేసిన ప్రజాధనం, ఒక్కొక్కరిపై లక్షరూపాయల అప్పుతప్ప మీకు చెప్పుకోవడానికేమయినా ఉందా? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇకనైనా రాష్ట్రంలో సాగిస్తున్న మీ కుటుంబ అరాచకాలను ఆపకకపోతే, మీకు అధికారాన్ని అప్పజెప్పిన తెలంగాణ ప్రజలే, మిమ్మల్నిఅధికార పీఠం నుంచి కూలదోసే రోజు వస్తుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు.