‘రాహుల్.. దమ్ముంటే ఓయూలో తిరుగు’.. కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, తెలంగాణలో కాంగ్రెస్

Update: 2024-07-12 14:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, రాహుల్‌కు దమ్ముంటే.. ఉస్మానియా యూనివర్శిటీలో తిరగాలాని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. శంషాబాద్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మూడోసారి మోడీ ప్రభుత్వానికి అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బండి సంజయ్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్.. ఆరు గ్యారంటీల పేరుతో చేసిన మోసాలను గుర్తించి బీజేపీకి 8 ఎంపీ స్థానాల్లో గెలిపించారని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయమని ఈ ఫలితాలతో ప్రజలు తీర్పునిచ్చిన ప్రజలకు సెల్యూట్ చేశారు.

మోడీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ విష ప్రచారం చేసినా ప్రజలు ఆ పార్టీని నమ్మలేదన్నారు. బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలు మరువలేనివని, ఎన్ని కేసులైనా తెగించి కొట్లాడారని బండి కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండాలని ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని సంజయ్ విమర్శలు చేశారు. ప్రధాని మోడీ రోజ్ గార్ మేళాతో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని రాహుల్ విమర్శలు చేస్తున్నారని, వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి 7 నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీయే అంటువ్యాధిలాంటిదని బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు.


Similar News