దిశ, తెలంగాణ బ్యూరో: అఖిలపక్షాల ఆధ్వర్యంలో 'నిరుద్యోగుల గోస - అఖిలపక్ష భరోసా' నిరసన దీక్ష కేవలం ఆరంభం మాత్రమేనని, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో వ్యవహారంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిరసన దీక్షలో వక్తలు హెచ్చరించారు. పేపర్ లీకేజీ విషయంలో విచారణ పూర్తి కాకుండానే, ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా ఇవ్వకుండా, బోర్డు మళ్ళీ పరీక్షలు నిర్వహించడం దొంగళ చేతికి తాళం ఇవ్వడమేనని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. పేపర్ లీకేజీ ఘటనలో నెల రోజులకు పైగా విచారణ చేపడుతున్నారని సిట్ అధికారులు మాత్రం ఒక్క సారి కూడా మీడియా ముందుకు రాలేదని.. విచారణ పారదర్శకంగా లేదని వక్తలు వెల్లడించారు.
మంగళవారం ఇందిరాపార్కు వద్ద టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన నిరుద్యోగుల గోస - అఖిలపక్ష భరోసా నిరసన దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆస్తుల మీద దృష్టి పెట్టారని, కానీ రాష్ట్ర సమస్యలు నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి అప్పగించాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బోర్డు కమిషన్ చైర్మన్, సభ్యులను వెంటనే తొలగించి, నూతన కమిటీ ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు లక్ష రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
లీకేజీలను తట్టుకోలేక కమిషన్ సభ్యుడు రాజీనామా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నిరుద్యోగుల దీక్ష ఇది కేవలం ఆరంభం మాత్రమేనని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులైన కమిషన్ సభ్యులపై పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యుడు అయిన ఆరేపల్లి చంద్రశేఖర్ రావు ఈ లీకేజీలను తట్టుకోలేక రాజీనామా చేశారని ఆరోపించారు. ఇంకో సభ్యుడు కారెం రవీందర్ రెడ్డి ప్రొఫైల్ వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారు? సమాధానం చెప్పాలన్నారు. జైల్లో ఉన్న 13 మంది నిందితులకు ప్రాణహాని ఉందని అన్నారు. కమిషన్ ప్రక్షాళన జరిపి, నూతన నిజాయితీ గల అధికారులతో కమిషనర్ ఏర్పాటైన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే ఎమ్మెల్యే, ఎంపీల క్యాంప్ ఆఫీసుల ముట్టడి చేస్తామని హెచ్చరించారు. పేపర్ల లీకేజీ వ్యవహారంలో సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుల ఫోన్లు చెక్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో టాపర్ ఎవరో కేసీఆర్ ప్రకటించాలని అన్నారు. సిట్ అధికారులు పత్రికా సమావేశం ఎందుకు పెట్టడం లేదు.? అని ప్రశ్నించారు. సిట్ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే నడుస్తుందన్నారు. పదో తరగతి పేపర్ లీకేజీలో 48 గంటల్లో నిందితులను జైలుకు పంపిన పోలీసులు.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనాన్ని వీడి.. బయటకు వచ్చి లీకేజీ గురించి మాట్లాడాలని అన్నారు.
ప్రగతి భవన్ పబ్లిక్ హాస్పిటల్ కాబోతుంది : రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి
ప్రగతి భవన్‌ను పబ్లిక్ హాస్పిటల్ చేసే రోజులు దగ్గర పడ్డాయని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు. ఏ దొంగలు ఐతే టీఎస్పీఎస్సీ లీక్ చేశారో మళ్ళీ పరీక్షలు వారికే అప్పాజెప్పారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఎవరికీ ఇచ్చారు అని మండిపడ్డారు. ఇప్పటివరకు ఇంటికో ఉద్యోగంపై నిపుణులతో కూర్చొని ప్రణాళిక లాంటివి సిద్ధం చేశారా ?అని ప్రశ్నించారు. మొత్తం 50 లక్షల ఉద్యోగాల్లో 25 లక్షల ఉద్యోగాలు తెలంగాణ కు ఇచ్చే కెపాసిటీ ఉందని తెలిపారు. కానీ ఈ విషయాలు ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
బలమైన క్రిమినల్ పొలిటీషియన్‌ను ఓడిద్దాం: ప్రజా యుద్దనౌక గద్దర్
రాష్ట్రంలో బలమైన క్రిమినల్ పొలిటిషయన్‌ను ఓడించడం కోసం అఖిల పక్షాలు ఐక్యం ఐక్యమయ్యాయని ప్రజా యుద్దనౌక గద్దర్ అన్నారు. అఖిలపక్షం ధర్మ యుద్ధం చేస్తున్నారని తెలిపారు. అఖిలపక్షం ఐక్యంగా నిరుద్యోగుల సమస్యలపై పోరాడాలని తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, టీజేఎస్, బీఎస్పీ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, ప్రజాపంథా పార్టీల నేతలు, విద్యార్థి యువజన సంఘాలు, ప్రజాసంఘాల నేతలు, నిరుద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.