టీఎస్‌పీఎస్సీ బోర్డు కేసులో మరో ఇద్దరి అరెస్ట్..!

టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల చోరీ కేసులో సిట్​ అధికారులు తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

Update: 2023-05-05 16:54 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల చోరీ కేసులో సిట్​ అధికారులు తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ అనుకున్నంత వేగంగా జరగటం లేదని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సిట్​అధికారులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు సంబంధించిన బ్యాంక్​ అకౌంట్లను మరోసారి విశ్లేషించిన అధికారులు వాటి ద్వారా లభ్యమైన వివరాల క్రమంలోనే తాజా అరెస్టులు జరిపినట్టు సమాచారం.

టీఎస్పీఎస్సీ బోర్డులో అసిస్టెంట్​సెక్షన్​ ఆఫీసర్​గా పనిచేస్తున్న ప్రవీణ్​కుమార్​నెట్​వర్క్​ఇంఛార్జీగా ఔట్​సోర్సింగ్​పై ఉద్యోగం చేస్తున్న రాజశేఖర్​రెడ్డితో కలిసి కాన్ఫిడెన్షియల్​ రూంలోని కంప్యూటర్ ​నుంచి వేర్వేరు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను సెట్లకు సెట్లు కొట్టేసిన విషయం తెలిసిందే. దీంట్లో ఏఈఈ సివిల్, జనరల్ ​నాలెడ్జ్​కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కూడా ఉన్నాయి. వీటిని ప్రవీణ్​ కుమార్​ తనకు పాత పరిచయం ఉన్న గురుకుల టీచర్ ​రేణుకకు పదిలక్షల రూపాయలకు విక్రయించాడు. రేణుక తన భర్త లద్యావత్ ​డాక్యా నాయక్​కు ఇవ్వగా అతను వేర్వేరు వ్యక్తులకు వీటిని విక్రయించాడు.

తాజాగా డాక్యా నాయక్ ​బ్యాంక్ ​అకౌంట్​ను పరిశీలించినపుడు భగవంత్​ కుమార్​ అనే వ్యక్తి అతని అకౌంట్​లోకి లక్షా డెబ్భయి అయిదు వేల రూపాయలు జమ చేసినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో సిట్​అధికారులు భగవంత్​కుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జరిపిన విచారణలో తన తమ్ముడు రవి కుమార్ ​కోసం ఏఈఈ సివిల్, జనరల్​ నాలెడ్జ్​ ప్రశ్నాపత్రాలను రెండు లక్షలకు కొన్నట్టుగా వెల్లడించాడు. ఈ ప్రశ్నాపత్రాల సహాయంతో రవికుమార్​ పరీక్ష కూడా రాసినట్టు చెప్పాడు. ఈ నేపథ్యంలో సిట్​అధికారులు రవికుమార్​ను కూడా అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 21కి చేరింది.

తాజాగా అరెస్టయిన అన్నదమ్ములు మహబూబ్​నగర్​ జిల్లాకు చెందినవారు కావటం గమనార్హం. ఇక, ఇదే కేసులో నిందితునిగా ఉండి ప్రస్తుతం న్యూజీలాండ్​లో ఉన్న ప్రశాంత్​రెడ్డి ఇంకా అరెస్టు కావాల్సి ఉంది. హైదరాబాద్​ రావాలని చెప్పినా ప్రశాంత్ రెడ్డి స్పందించటం లేదని సిట్​కు చెందిన ఓ అధికారి చెప్పారు. ఈ క్రమంలో అతన్ని ఇక్కడకు రప్పించటానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు.

Tags:    

Similar News