కమ్మ సంఘం భూ కేటాయింపులో ట్విస్ట్.. రూ. 150 కోట్ల ల్యాండ్‌పై BRS నేత కన్ను!

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 2.3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Update: 2024-06-20 03:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 2.3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. తన అనుచరులు, బినామీలను ప్రోత్సహించి, కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఉన్నపళంగా సర్కారు భూమిలో యాక్టివిటీ స్టార్ట్ అవడటంతో ఆ భూమిని రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కబ్జా పర్వానికి బీఆర్ఎస్ రూలింగ్‌లోనే బీజం పడిందనే టాక్ ఉంది. గులాబీ బాస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ప్రజాప్రతినిధి ఆ భూమిని కమ్మ సంఘానికి కేటాయించే విషయంలో చక్రం తిప్పి, పక్కనే ఉన్న 2.3 ఎకరాల భూమిని కొట్టేసేందుకు ప్లాన్ వేసినట్టు చర్చ జరుగుతున్నది.

రూ. 150 కోట్ల విలువైన భూమి

హైటెక్ సిటీకి సమీపంలో ప్రస్తుతం మార్కెట్‌లో ఎకరం ధర రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు పలుకుతున్నది. అంత విలువైన భూమిని తన ఖాతాలో వేసుకునేందుకు ఓ గులాబీ ప్రజాప్రతినిధి భారీ స్కెచ్ వేశారు. తనకున్న పరిచయాలతో (సర్వే నంబర్ 11/1/2, ఖానామెట్ విలేజ్, శేరిలింగం పల్లి మం.) సుమారు 2.3 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకోడానికి ప్రయత్నిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా సదరు లీడర్ తెరమీదికి రాకుండా జాగ్రత్తలు తీసుకుని, మొత్తం కథను నడిపిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అనుచరులను రంగంలోకి దింపి, కరెంట్ స్తంభాలను పాతేందుకు పనులు షురూ చేశారు. అయితే అది ప్రభుత్వ భూమి అనే విషయం ఆ ప్రాంతంలోని స్థానికులకు అందరికి తెలుసు. కానీ పది రోజుల క్రితం సడన్‌గా ఆ స్థలంలో కరెంట్ స్తంభాలు నిర్మించేందుకు పనులు మొదలయ్యాయి. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ప్రభుత్వ భూమిని కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు కబ్జా చేస్తున్నారని, వెంటనే ఆ భూమిని రక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్థానిక అధికారుల పాత్రపై అనుమానాలు

మొన్నటివరకు ఎలాంటి నిర్మాణాలు లేని ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలను పాతేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానిక మున్సిపల్, విద్యుత్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్న తరువాతే పనులు మొదలయ్యాయా? లేక సదరు గులాబీ లీడర్ తనకున్న పలుకుబడితో పనులు చేయిస్తున్నారా? అనే చర్చ జరుగుతున్నది. ఒకవేళ మున్సిపల్, ఎలక్ర్టిసిటీ డిపార్ట్ మెంట్స్ నుంచి అనుమతి తీసుకుంటే, ఎవరి పేర్లమీద దరఖాస్తు చేశారు? ఇంతకాలం సర్కారు భూమిగా ఉన్న ఆ స్థలం ఎవరి పేరుమీద రిజిస్ట్రేషన్ జరిగింది?అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

మూడేళ్ల క్రితం నుంచే కబ్జాకు ప్లాన్

బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ సిటీలో అన్ని కుల సంఘాల భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వం భూములు కేటాయించింది. అందులో భాగంగా కమ్మ సంఘానికి ఏ ప్రాంతంలో భూమిని కేటాయించాలని ఆరా తీస్తుండగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి హైటెక్ సిటీ సమీపంలో ప్రభుత్వ భూమి ఉందని గులాబీ బాస్ కు సూచించినట్టు సమాచారం. దీంతో ఖానామెట్ గ్రామం, శేరిలింగంపల్లి మండలంలోని సర్వే నంబర్ 11/1/2 లో మొత్తం 7.3 ఎకరాలు ఉండగా, అందులో 5 ఎకరాలను కమ్మ సంఘానికి జీవో.నంబర్ 214 ద్వారా 21.12.2021లో కేటాయించారు. పక్కనే ఉన్న సుమారు 2.3 ఎకరాల భూమిని తన ఖాతాలో వేసుకునేందుకు ప్లాన్ వేసినట్టు ప్రచారం జరిగింది. కాని కోర్టు కేసు కారణంగా ఆ భూమిని కమ్మ సంఘానికి ప్రభుత్వం కేటాయించకపోవడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.

కబ్జాకు నాటి సర్కారు బ్లెస్సింగ్స్?

హైటెక్ సమీపంలోని భూమిని కమ్మ సంఘానికి ఎందుకు కేటాయించాలనే అంశంపై సదరు కమ్మ లీడర్ అప్పటి ప్రభుత్వ పెద్దలకు వివరించినట్టు ప్రచారం ఉంది. సదరు లీడర్ కు ఫేవర్ చేసేందుకే బీఆర్ఎస్ కీలక నేతలు అక్కడే కమ్మ సంఘానికి ఐదెకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అదే సామాజికవర్గానికి చెందిన కులస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే, బీఆర్ఎస్ పాలనలోనే అక్కడ నిర్మాణాలు చేయాలని సదరు లీడర్ ప్లాన్ వేశారు. కానీ విలువైన భూములను కమ్మ కుల సంఘానికి కేటాయించడాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చింది. ఈలోపు ప్రభుత్వం మారడంతో గులాబీ లీడర్ కబ్జా చేసేందుకు తన అనుచరులను రంగంలోకి దింపారనే ఆరోపణలు వస్తున్నాయి.


Similar News