గుండెను పిండేస్తున్న నిరుద్యోగుల బాధ.. లీక్ అయిన పేపర్ విలువ ఎంతో తెలుసా?

రాష్ట్రంలో మొదటి నుంచీ ఉద్యోగాల భర్తీలో పాదర్శకత లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2023-03-16 11:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మొదటి నుంచీ ఉద్యోగాల భర్తీలో పాదర్శకత లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015లో భర్తీ చేసిన సింగరేణి ఉద్యోగాల మొన్న నిర్వహించిన ఏఈ ఎగ్జామ్ వరకు ఏదో వివాదం చోటుచేసుకుంటూనే ఉన్నది. తాజాగా.. ఏకంగా TSPSC లో పనిచేసే ఉద్యోగే పేపర్ లీకేజీలకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు ఎన్ని పారదర్శకంగా జరిగాయో లేదో తెలియక టెన్షన్ పడుతున్నారు. అసలు ఈ ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందా? అని కూడా ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు నోటిఫికేషన్ కోసం నిరసనలు చేసిన నిరుద్యోగులు, ఇప్పుడు భర్తీని పారదర్శకంగా నిర్వహించండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులు కోచింగ్‌లు తీసుకుంటూ.. ఇన్నాళ్లు నగరాల్లో పడిన బాధలను గుర్తుచేసుకొని కంటనీరు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి బాధలను వ్యక్త పరుచుకుంటున్నారు.


లీక్ అయిన పేపర్ విలువ ఎంత?

‘‘ఊరి నుంచి పట్నంకు భుజాలపైన బియ్యం బస్తాలతో పాటు మోసుకొచ్చిన బాధ్యతల బరువంతా.. సొంత ఊరిలో అయిన వాళ్లందరితో సంతోషంగా గడిపే పండుగలకు వెళ్లలేని దూరమంతా.. నీ కొడుకు, నీ కూతురికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని అడిగిన ప్రతీ ఒక్కరికి సమాధానం చెప్పలేక తలదించుకొని కన్నీళ్లతో వహించే మౌనమంతా.. ఉద్యోగం కోసం కాలంతో పరుగులు తీస్తూ కరిగిపోయిన వయసంతా.. సరిపడా పైసలు లేక.. రెండు పూటలే తింటే మూడో పూటకు డొక్క చేసే ఆకలి కేకలంతా.. రాత్రి పడుకున్నాక ఉద్యోగం రాదేమో అన్న భయంతో గుండె చేసే శబ్ధం మనం ఉండే ఇరుకు గదిలో ప్రతిధ్వనించింతా’’ అంటూ నిరుద్యోగులు నెట్టింట పెడుతోన్న పోస్టులకు నెటిజన్లుకూడా కంటనీరు పెట్టి వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఉద్యోగాల భర్తీని పారదర్శంగా నిర్వహించాలని, అర్హులైన వారికి అన్యాయం జరుగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News