TSPSC చైర్మన్, కార్యదర్శిని వెంటనే తొలగించాలి: విద్యార్థి సంఘాల డిమాండ్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

Update: 2023-03-14 14:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, వీజేఎస్ విద్యార్థి సంఘాల నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్ష కూడా లీకైనట్లుగా వార్తలు వస్తున్నాయని, తెలంగాణ ఏర్పడిన నుంచి నియామకాలు లేక ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూస్తున్న నిరుద్యోగులు ఇలాంటి చర్యలతో తీవ్రనష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.

లక్షల రూపాయలు వెచ్చించి, విలువైన సమయం కేటాయించి లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్నారని తెలిపారు. బోర్డులో ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన బోర్డు చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి, బోర్డు కార్యదర్శి, సభ్యుల పాత్రలపైనా విచారణ జరిపించాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చైర్మన్‌ను తొలగించి వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీరితోపాటు బోర్డులో వీరి వెనుక ఉన్న వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి ఆర్ ఎల్ మూర్తి, టి నాగరాజు డిమాండ్ చేశారు.

విద్యార్థి జన సమితి టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడి

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై నిరసిస్తూ విద్యార్థి జన సమితి(వీజేఎస్) ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా అరెస్ట్ చేసిన వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరాల ప్రశాంత్, రాష్ట్ర నాయకులు ప్రవీణ్ ఆర్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్ యాదవ్, నాయకులు దినేష్, కల్యాణ్, అర్జున్, తేజ, మధులను అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సర్దార్ వినోద్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లు అక్రమాలకు పాల్పడుతూ.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ పేపర్ లీకేజీ ఘటన మీద సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News