తెలంగాణలో మరో కొత్త రిక్రూట్మెంట్ బోర్డు.. ప్రభుత్వం కసరత్తు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 80వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 80వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఓ కొత్త రిక్రూట్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేసే యోచనతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. టీఎస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. దీనిపై ఇప్పటికే సీనియర్ అధికారులతో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించినా కొంత అనుమానాలు వ్యక్తమవుతుండటం, టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ – 1 నుంచి గ్రూప్ –4 వరకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సి రావడం, దీంతో టీఎస్పీఎస్సీపై భారం పడటమే కాకుండా ఆలస్యమవుతుందనే కారణాలతో టీఎస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఏ ఏ పోస్టులు భర్తీ చేయాలి, కమిటీ నియామకం, విధివిధానాలను సిద్ధం చేసేందుకు సీనియర్ ఐఏఎస్‌లకు సూచనలిచ్చినట్లు తెలుస్తోంది.
నమ్మకం పెంచాల్సిందే
వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ.. నిరుద్యోగుల్లో కొంత అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ తరుపున సీఎం నుంచి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, పార్టీ నేతలు కూడా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. ఉద్యోగాల భర్తీపై కట్టుబడి ఉన్నామంటూ పదేపదే చెప్పుకొస్తున్నారు. దీనిపై ఇటీవల విపక్షాల నుంచి విమర్శలు కూడా పెరుగుతున్నాయి. దాదాపుగా మూడేండ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ రాకపోవడంపై కూడా నిరుద్యోగుల అనుమానాలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరుపున వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారనే సంకేతాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఐఏఎస్‌లకే సారధ్యం
రాష్ట్రంలో టీఎస్పీఎస్సీతో పాటుగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు జరుగుతున్నాయి. గ్రూప్ –1 నుంచి గ్రూప్ –4 వరకు నియామకాలు టీఎస్పీఎస్సీ చేస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ ఎగ్జామ్ అయినప్పటికీ ఒక్కో పరీక్ష, ఇంటర్వ్యూలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ వంటి కారణాలతో నియామకాలు ఆలస్యమవుతున్నాయి. కొన్ని డిపార్ట్మెంట్ పరమైన పరీక్షలు కూడా యథాతథంగా నిర్వహించాల్సిన బాధ్యత కూడా టీఎస్పీఎస్సీదే. ఇప్పుడు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో టీఎస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులతో సైతం చర్చించినట్లు తెలుస్తోంది. టీఎస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి, ఇద్దరు ఐఏఎస్‌లకు సారథ్యబాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. దీనిలో ఎంతమంది కమిటీ, నిర్వహణ, నియమనిబంధనాలపై కూడా త్వరగా అధ్యయనం చేసి నివేదించాలని ఆదేశించినట్లు ఓ అధికారి వెల్లడించారు. టెక్నికల్ పరమైన ఉద్యోగాలతో పాటుగా ఇంజినీరింగ్ ఉద్యోగాల నియామకం ఈ బోర్డుకు అప్పగించాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పుతున్నారు.