అవే టార్గెట్.. అసెంబ్లీ వేదికగా టీఆర్‌ఎస్ సరికొత్త వ్యూహం

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఫోకస్ షిప్ట్ అవుతున్నది. నిన్నమొన్నటిదాకా టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ సభ్యులే. ఈసారి బీజేపీ సభ్యులపైకి బాణాన్ని ఎక్కు పెట్టాలనుకుంటున్నది.

Update: 2022-03-07 01:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఫోకస్ షిప్ట్ అవుతున్నది. నిన్నమొన్నటిదాకా టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ సభ్యులే. ఈసారి బీజేపీ సభ్యులపైకి బాణాన్ని ఎక్కు పెట్టాలనుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని కార్నర్ చేయాలనుకుంటున్నది. గవర్నర్ ప్రసంగం విషయమంలో అధికార పార్టీని తప్పుపట్టాలని కాంగ్రెస్, బీజేపీ నిర్ణయించుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ విమర్శించాలనుకుంటున్నాయి. దీనిని పసిగట్టిన టీఆర్ఎస్ గట్టిగానే కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నది. గవర్నర్ వ్యవస్థనే ప్రశ్నించడం ద్వారా బీజేపీని ఇరుకున పెట్టవచ్చని భావిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత వ్యూహం మార్చుకున్న టీఆర్ఎస్‌ ఈ సమావేశాల నుంచే దూకుడు పెంచాలనుకుంటున్నది. సెషన్ జరిగే టైమ్‌లోనే ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వాటిని కూడా సందర్భానుసారం వాడుకోనున్నది. కేవలం ముగ్గురు మాత్రమే బీజేపీ సభ్యులు ఉన్నందున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడా తగ్గేదే లే అనే తీరులో సరిగ్గా కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన ఉదాహరణలను, సంఘటనలను ఇప్పటికే రెడీ చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అనే అభిప్రాయం యావత్ దేశానికి వెళ్లేలా టీఆర్ఎస్ వ్యవహరించనున్నది.

ప్రతిపక్ష స్థానంలో ఈటల

హుజూరాబాద్ ఫలితాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోయింది. అప్పటి నుంచే బీజేపీ వ్యతిరేక వైఖరి మొదలైంది. ఇంతకాలం మంత్రి హోదాలో అసెంబ్లీలో అధికార పార్టీ స్థానంలో కూర్చున్న ఈటల ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో కనిపించనున్నారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసినందున ఇప్పుడు బడ్జెట్‌పై బీజేపీ తరఫున చర్చలో ఈయనే పాల్గొంటున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి హరీశ్‌రావు, చర్చల సందర్భంగా అవసరమైతే జోక్యం చేసుకునే సీఎం కేసీఆర్ దీర్ఘకాలంగా ఈటల రాజేందర్‌తో సన్నిహితంగా ఉన్నవారే. ఇంతకాలం ప్రభుత్వ పథకాలను ప్రశంసించి సొంతం చేసుకున్న ఈటల ఇప్పుడు ఎండగట్టే పాత్రను పోషించబోతున్నారు. ఆయన చేసే కామెంట్లను గట్టిగా తిప్పికొట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అవసరమైతే గతంలో ఇదే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అభినందించిన అంశాలను తేదీలతో సహా గుర్తుచేసి ఈటల నోరు మూయించాలనుకుంటున్నారు. తెలంగాణ బడ్జెట్‌ను బీజేపీ సభ్యులు తప్పుపట్టే ప్రయత్నం చేస్తే దానికి కౌంటర్‌గా కేంద్ర బడ్జెట్‌లో ఏమిచ్చిందో ఉదాహరణలతో సహా వివరించే కసరత్తు జరుగుతున్నది.

కాంగ్రెస్‌పై తగ్గనున్న విమర్శలు

టీఆర్ఎస్ వ్యూహం ప్రకారం ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్‌ను కార్నర్ చేయకపోవచ్చని సమాచారం. ఇప్పటివరకు జరిగిన అన్ని అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా 'ఇదంతా మీ పాపమే గదా.. మీకు తెలివి ఉంటే కల్యాణలక్ష్మి, రైతుబంధు లాంటి పథకాలను పెట్టలేదెందుకు?..' అంటూ తనదైన శైలిలో తిప్పికొట్టారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం కాంగ్రెస్ పుణ్యమేగదా అంటూ సెటైర్లు కూడా వేశారు. ఇకపై ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ పైన చేయకపోవచ్చనే వార్తలు టీఆర్ఎస్ వైపు నుంచి వినిపిస్తున్నాయి. పోకస్ బీజేపీపై పెట్టడం ద్వారా ప్రధాన ప్రత్యర్థి ఆ పార్టీయే అనే ఇమేజ్‌ క్రియేట్ చేయాలనుకుంటున్నది.

Tags:    

Similar News