ఉత్కంఠ రేపుతోన్న ఆపరేషన్ 17.. సెంటర్ vs వర్సెస్ స్టేట్‌గా ఫైట్!
సెప్టెంబర్ 17 వేడుకలను ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రెడీ అయ్యాయి.
సెప్టెంబర్ 17 వేడుకలను ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా ఆ ఊసే ఎత్తని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సారి జాతీయ సమైక్యత పేరుతో ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్నది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభత్వం సైతం హైదరాబాద్ కేంద్రంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఆయన చేసే ప్రసంగంపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. సీఎం కేసీఆర్ సైతం ఎన్టీఆర్ స్టేడియం నుంచి కౌంటర్ ఇచ్చేచాన్స్ ఉంది. ఏది ఏమైనా సెంటర్, స్టేట్ మధ్య ఓ యుద్ధవాతావరణం నెలకొన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: ఈసారి రాష్ట్రంలో సెప్టెంబరు 17 వేడుకలు హోరెత్తనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వా.. నేనా అన్న చందంగా ఉత్సవాలు నిర్వహించనున్నాయి. ఎనిమిదేళ్ళుగా అటు సెంటర్, ఇటు స్టేట్ సెప్టెంబరు 17 ఊసే ఎత్తలేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో రెండు పార్టీలు (ప్రభుత్వాలు) రెడీ అయ్యాయి. పెరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం జరుపుతుండగా ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నది. రెండు ప్రభుత్వాల తరఫున అధికార పార్టీలు పోటీపడి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. విమోచన దినోత్సవం పేరుతో సెంటర్ చేస్తుండగా తెలంగాణ జాతీయ సమైక్యత పేరుతో స్టేట్ నిర్వహిస్తున్నది. ఈ వేడుకల్లో సీఎం, కేంద్ర హోం మంత్రి చేయబోయే ప్రసంగాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్ర ప్రభుత్వం తరఫున జరిగే వేడుకల్లో భాగంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూలదండ వేసి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర పారామిలిటరీ బలగాల కవాతులో గౌరవ వందనం స్వీకరించనున్నారు. వివిధ రకాల సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన అనంతరం సెప్టెంబరు 17 రోజుకు ఉన్న ప్రాధాన్యంపై అమిత్ షా ప్రసంగించనున్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడంలో, స్వాతంత్ర్యం ప్రసాదించడంలో అప్పటి కేంద్ర మంత్రి సర్దార్ పటేల్ చొరవను అమిత్ షా ఈ సందర్భంగా కీర్తించనున్నారు. పటేల్‌కు నిజమైన వారసులం తామే అనే సందేశాన్ని తెలంగాణ సమాజానికి పంపాలని భావిస్తున్నారు.
కేసీఆర్, ఒవైసీపైనే విమర్శనాస్త్రాలు?
కేసీఆర్‌ను ఇప్పటికే నయా నిజాంగా బీజేపీ అభివర్ణించింది. నిజాం వారసులుగా చెప్పుకునే మజ్లిస్ చేతిలో కారు స్టీరింగ్ ఉన్నదని విమర్శించింది. ఇప్పటికీ ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు కోసం ఈ రెండు పార్టీలూ మిత్రపక్షాలుగా ఉన్నాయని కామెంట్ చేసింది. పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా సెప్టెంబరు 17 చరిత్రను అమిత్ షా తన ప్రసంగంలో ఏ విధంగా ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకేసారి కేసీఆర్‌ను, మజ్లిస్ అధినేత ఒవైసీపై విమర్శనాస్త్రాలు సంధించడం ఖాయమని రాష్ట్ర బీజేపీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న చేదు అనుభవాలను నేటి తరానికి తెలియజేసే ఉద్దేశంతో ఎక్కువగా ఈ వేడుకలకు యువతను ఆహ్వానించాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ భావిస్తున్నది. అప్పటి సాయుధ రైతాంగ పోరాటాన్ని దృశ్య రూపకంగా తెలియజేయాలనుకుంటున్నది. ఫొటో ఎగ్జిబిషన్, వీడియో డాక్యుమెంటరీ లాంటి ప్రోగ్రామ్‌లకు ప్లాన్ చేసింది. విమోచనా దినోత్సవాన్ని జరిపిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన టీఆర్ఎస్ గడచిన ఎనిమిదేళ్ళుగా దూరం పెట్టడానికి కారణం మజ్లిస్ పార్టీకి భయపడేననే వాదనను బీజేపీ ఇప్పటికే తెరపైకి తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని అమిత్ షా పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా నొక్కిచెప్పాలనుకంటున్నట్లు తెలిసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ మైలేజీ వచ్చేలా టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశమున్నది. అమిత్ షా చేసే ప్రసంగంలోని అంశాలను కౌంటర్ ఇవ్వడానికి టీఆర్ఎస్ నాయకులు కూడా అంతే స్థాయిలో ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ స్టేడియంలో కేసీఆర్ స్పీచ్
కేంద్ర ప్రభుత్వం పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమం మధ్యాహ్నంకల్లా పూర్తికానున్నది. అమిత్ షా లేవనెత్తే అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అదే రోజు సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగసభలో ప్రస్తావించాలనుకుంటున్నారు. సుమారు లక్ష మందిని ఈ సభకు తరలించాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సుల్ని పెట్టి గిరిజన, ఆదివాసీ ప్రజలను తరలించాలనుకుంటున్నది. ఇప్పటికే ఆర్టీసీతో ఒప్పందం చేసుకుని అద్దె ప్రాతిపదికన బస్సుల్ని రిజర్వు చేసుకున్నది. బీజేపీ చెప్పే విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ తనదైన శైలిలో జాతీయ సమైక్యతా దినోత్సవంగా చెప్పాలనుకుంటున్నారు. స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం అయిన ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకునేలా ఈ వేడుకలకు టైటిల్‌ను ఖరారు చేసింది. ఈ వేడుకలను పురస్కరించుకుని తొలుత సెప్టెంబరు 17న పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నానికి బంజారాభవన్, ఆదివాసీ భవన్‌లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. తెలంగాణ ప్రతీకలుగా ఉన్న గుస్సాడీ, గోండు, లంబాడా నృత్యాలతో పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనతో ర్యాలీని నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది. కేసీఆర్ చేసే ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని, అమిత్ షా ని ఏ రీతిలో విమర్శిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోసారి పబ్లిసిటీ వార్
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చోటుచేసుకున్న రాజకీయ వైరం క్రమంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్‌గా మారింది. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ర్య మంత్రులు వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీని ఫాసిస్టుగా కూడా సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగానే కామెంట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నగరంలోని మెట్రో పిల్లర్లు, సిటీ బస్ స్టాప్ షెల్టర్లు, హోర్డింగులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం టీఆర్ఎస్ ముందుగానే బుక్ చేసుకున్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విమోచనా దినోత్సవ వేడుకలకు పబ్లిసిటీ రాకుండా మరోసారి అలాంటి స్కెచ్ వేసింది. దీన్ని ముందుగా ఊహించలేకపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 'చిల్లర రాజకీయం' అంటూ టీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. ప్రజలను పెరేడ్ గ్రౌండ్స్ సభకు తరలించడానికి ఆర్టీసీ బస్సులను బుక్ చేద్దామనుకున్న కిషన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మొత్తం బస్సులు టీఆర్ఎస్ కోసం రిజర్వు అయిన విషయాన్ని తెలుసుకుని షాక్ కు గురయ్యారు. అనేక ప్రయత్నాల తర్వాత కొన్ని బస్సుల్ని మాత్రం తెప్పించుకోగలిగారు. కానీ ఫ్లెక్సీలు, పోస్టర్లకు మాత్రం బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి అవకాశం లభించలేదు. రెండు పార్టీల మధ్య ఘర్షణ చివరకు రెండు ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలకు, పోటాపోటీ వేడుకల నిర్వహణకు దారితీసింది.