తెలంగాణ ఇన్‌చార్జి డీజీపీగా అంజనీకుమార్

రాష్ట్ర ఇన్‌చార్జి డీజీపీ (పోలీసు డైరెక్టర్ జనరల్)గా అంజనీకుమార్‌ను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

Update: 2022-12-29 11:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఇన్‌చార్జి డీజీపీ (పోలీసు డైరెక్టర్ జనరల్)గా అంజనీకుమార్‌ను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన స్థానంలో ఫుల్ టైమ్ డీజీపీ నియామకం జరిగేంత వరకు అంజనీకుమార్‌కు డీజీపీ కోఆర్డినేషన్ బాధ్యతలతో పాటు ఫుల్ అడిషనల్ ఛార్జి (ఎఫ్ఏసీ) డీజీపీ (హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్) బాధ్యతలను అప్పగించారు. గతంలో నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన అంజనీకుమార్ ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అవినీతి నిరోధక శాఖ డీజీ బాధ్యతలను హోం కార్యదర్శి రవిగుప్తాకు అప్పగించారు. ఆయన జీఏడీలోని విజిలెన్స్-ఎన్‌ఫోర్స్ మెంట్ బాధ్యతలను కూడా ఎఫ్ఏసీగా నిర్వహించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. రవిగుప్తాను హోం కార్యదర్శి స్థానం నుంచి బదిలీ చేయడంతో ఆ బాధ్యతలను లా అండ్ ర్డర్ అదనపు డీజీగా ఉన్న డాక్టర్ జితేందర్ చేపట్టనున్నారు. హోంశాఖ కార్యదర్శి బాధ్యతలతో పాటు జైళ్ళ శాఖ డీజీగానూ జితేందర్ వ్యవహరించనున్నారు.

రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్ భగవత్‌ను సీఐడీ విభాగం అదనపు డీజీగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న దేవేంద్రసింగ్ చౌహాన్‌ను ఇకపైన రాచకొండ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించనున్నారు. డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీగా ఉన్న సంజయ్ కుమార్ జైన్‌ను లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా నియమించారు. ఈ బాధ్యతలతో పాటు ఎఫ్ఏసీగా అగ్నిమాపక శాఖ డీజీ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. ఒకేసారి ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి.


Similar News