శిక్షణ సరే... ఉపాధి ఏదీ...? రుణాలు ఇప్పిస్తామని ఫ్రాడ్

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉపాధి శిక్షణను తీసుకొని జీవితంలో స్థిరపడాలని పాలకులు సూచిస్తున్నారు.

Update: 2023-05-05 02:07 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: చదువుకున్న ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉపాధి శిక్షణను తీసుకొని జీవితంలో స్థిరపడాలని పాలకులు సూచిస్తున్నారు. దానికోసం కొన్ని సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ఇందులో వాస్తవాల కంటే బోగస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. శిక్షణ పేరుతో దోపిడీ జరుగుతుందని ప్రచారం జోరందుకుంది. శిక్షణ కాలంలో మెటీరియల్ భోజనం ఆ తర్వాత స్వయం ఉపాధి కోసం సహకారం అందజేయడం లాంటివి లేకుండానే నిరుద్యోగ యువ తను బ్యాంకుల నుంచి రుణ సహకారం అందిస్తామని పేరుతో మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆర్‌ఎస్‌ఈటీఐ ఆధ్వర్యంలో శిక్షణ

గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఎస్‌బీఐ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం నిధుల సహకారంతో స్వయం ఉపాధి కోసం శిక్షణ అందిస్తున్నాయి. వీటి ద్వారా స్వయం శక్తితో యువతను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ శిక్షణలు ఉపయోగపడతాయి. అందులో భాగంగానే 2006 నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ శిక్షణను మొదలుపెట్టారు. ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. మొదట ఎస్‌బీఐ బ్యాంకు నిధులను వినియోగించి శిక్షణ ఇస్తారు. సెల్‌ఫోన్, టైలరింగ్, హార్డ్వేర్, బ్యూటీషియన్ కోర్సులతో పాటు ఇతర కోర్సుల్లో కూడా శిక్షణ ఉంటుంది. కోర్సును బట్టి ఆరు రోజుల నుంచి 45 రోజుల వరకు కాలపరిమితి ఉంటుంది. ప్రతి బ్యాచ్‌కు 25 నుంచి 30 మంది వరకు ఇక్కడ శిక్షణ తీసుకుంటారు. ప్రతి ఏటా సుమారు 600 నుంచి 700 పైగా నిరుద్యోగులు శిక్షణ పొందుతారు. బిల్లులు మొత్తాన్ని డిఆర్డిఏ సమర్పించి బడ్జెట్ తీసుకుంటారు. అయితే ఈ శిక్షణ కోసం ప్రతి ఏడాది సుమారు 60 లక్షల బడ్జెట్ను కేటాయిస్తారు.

రుణాల పేరుతో మోసం

ప్రతి ఏటా శిక్షణ పొందిన యువతీ యువకుల్లో సుమారు 80 శాతం మందిని స్వయం ఉపాధిలో సెటిల్ అయ్యేవిధంగా సహకారం అందించాల్సి ఉంది. దానికి బ్యాంకుల నుంచి కూడా సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈ శిక్షణ కేంద్రం ప్రారంభమైన వాటి నుంచి సుమారు పదివేల మంది యువతకు శిక్షణ ఇచ్చారు. అందులో భాగంగానే గత ఏడాది 650 మంది ఇక్కడ శిక్షణ తీసుకున్నారు .అందులో 500 మంది స్వయం ఉపాధి పేరుతో స్థిరపడినట్లు శిక్షణ సంస్థ సిబ్బంది జాబితా తయారు చేశారు. ఇ దిలా ఉంటే సుమారు 300 మంది యువతకు సంబంధించి బ్యాంకులనుంచి రుణాలు అందిస్తామని చెబుతూ అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకొని ఇంతవరకు ఎలాంటి రుణాలు ఇప్పించలేదు .వాస్తవంగా చూస్తే గత ఏడాది ట్రైనింగ్ తీసుకున్న వారిలో ఇప్పటివరకు కనీసం 20 మంది కూడా వారి వారి వృత్తులు స్థిరపడలేదు. ప్రతి ఏటా సుమారు రూ.60 లక్షలు ఖర్చుచేసి శిక్షణ అందిస్తున్నా రు కానీ అందులో 50 శాతానికి పైగా దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శిక్షణ సొమ్ము దుర్వినియోగం

శిక్షణ కాలంలో కొంతమంది అడ్మిషన్ తీసుకొని శిక్షణకు రాకపోవడం మరికొంతమంది బయట ఉండి శిక్షణ సమయానికి వచ్చి పోతుండడం చేస్తుంటారు .ఇలా దాదాపు 40 నుంచి 50 శాతం మంది శిక్షకులు వసతి గృహంలో ఉండరు కానీ అలాంటి వారి భోజన ఖర్చులు ఇతర వారి కోసం ఖర్చు చేసే సొమ్మును పూర్తిగా శిక్షణా సిబ్బంది కాజేస్తుంటారని సమాచారం.

శిక్షణ తర్వాత సాయమేలేదు...

స్వయం ఉపాధి కల్పిస్తామంటూ శిక్షణ పేరుతో మోసం చేస్తున్నారు. నేను సెల్ ఫోన్ రిపేర్ నేర్చుకున్నా. నాకు సర్టిఫికెట్ ఇవ్వమంటే ఆరు నెలలు తిప్పించుకున్నారు. బ్యాంకు లోన్ ఇప్పిస్తామని తీసుకున్నారు కానీ ఇప్పటివరకు ఇప్పించలేదు.

-రాంబాబు, చామ్లేడు గ్రామం (గుర్రంపోడు మండలం)

Tags:    

Similar News