స్థిత ప్రజ్ఞత ఉన్న నేత రాహుల్.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
స్థిత ప్రజ్ఞత ఉన్న నేత రాహుల్ గాంధీ అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: స్థిత ప్రజ్ఞత ఉన్న నేత రాహుల్ గాంధీ అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. భావి భారత ప్రధానిని విమర్శించే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రాహుల్ సంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక.. బీఆర్ఎస్ నేతలే పరిపక్వత లేనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అడ్డగోలుగా అవినీతి జరిగిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయాలకు పరాకాష్టగా మారాయన్నారు. పరిపక్వత అంటే అడ్డగోలు అవినీతి చేయడమా? అంటూ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ఇతర పార్టీల్లో గెలిచిన నాయకులను అక్రమంగా గుంజుకొని.. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం విచిత్రంగా ఉన్నదన్నారు.
నియంతలా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేశాన్ని విద్వేషాల నుంచి ఐక్యత సాధించేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మహా మనిషి రాహుల్ గాంధీ అని కొనియాడారు. అలాంటి గొప్ప నిస్వార్ధ నేత గురించి బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తే ప్రజలే బుద్ది చెబుతారన్నారు.