కళాత్మక పోటీల్లో గురుకుల విద్యార్థుల హవా
దేశవ్యాప్తంగా ముంబై కి చెందిన డ్రీం ఫ్యామిలి అనే కళారంగ సంస్థ ప్రతి ఏడాది వివిధ కళలకు సంబంధించి పోటీలను నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సహకరంగా పలు అవార్డులను అందిస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ముంబై కి చెందిన డ్రీం ఫ్యామిలి అనే కళారంగ సంస్థ ప్రతి ఏడాది వివిధ కళలకు సంబంధించి పోటీలను నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సహకరంగా పలు అవార్డులను అందిస్తోంది. ఈ పోటీల్లో ఏదులాబాద్ గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించడం పట్ల గురుకులాల కార్యదర్శి డా. అలుగు వర్షిణి హర్షం వ్యక్తం చేసారు. గురుకుల విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు , కళలు లాంటి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో పోటీ పడి అవార్డులు సాధించడం పట్ల విద్యార్థులను , కళాశాల సిబ్బందిని ఆమె అభినందించారు. డ్రీం ఫ్యామిలి సంస్థ నిర్వహించిన పోటీల్లో భాగంగా ఈ ఏడాది మార్చినెలలో ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 271 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇందులో 29 మంది తెలంగాణ రాష్టం నుండి ఒక్క ఏదులాబాద్ గురుకుల బాలుర జూనియర్ కాలేజ్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి అవార్డులను కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో చేతి వ్రాత , డ్రాయింగ్ , కలరింగ్ , కొలెజ్( ఛాయా చిత్రాలు ,కాగితం ముక్కలు ,ఫాబ్రిక్ లేదా ఇతర వస్తువులు వంటి వివిధ పదార్థాలను కలిపి కొత్త చిత్రాన్ని రూపొందించడం) బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ,కార్టూన్ డ్రాయింగ్ లాంటి 6 విభాగాల్లో నిర్వహించిన పోటీలో ఏదులాబాద్ గురుకుల విద్యార్థులు తమ కళా నైపుణ్యాన్ని, విశేష ప్రతిభ కనపరచడంతో ఈ అవార్డులను కైవసం చేసుకున్నారని డ్రాయింగ్ టీచర్ స్నిగ్ద తెలిపారు. ఈ పోటీలో పాల్గొన్న ఏదులాబాద్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు గోల్డ్ మెడల్ సాధించినట్టు డ్రీం ఫ్యామిలి సంస్థ ఏదులాబాద్ కాలేజ్ ప్రిన్సిపాల్ కు ఒక లేఖ ద్వారా తెలిపారు.