TPCC: సిరిసిల్ల వీరుడు కేటీఆర్ సిగ్గు లేని వ్యాఖ్యలు.. మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలపై గోబెల్ ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్ అభివృద్ది అంటే మీ ఫామ్ హౌజ్‌ల అభివృద్దేనా చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Update: 2024-09-30 12:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలపై గోబెల్ ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్ అభివృద్ది అంటే మీ ఫామ్ హౌజ్‌ల అభివృద్దేనా చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రానికి పెట్టుబడులు రావని గోబెల్ ప్రచారం చేస్తున్నారు. కానీ పెట్టుబడిదారులు హైద్రాబాద్ వాతావరణ పరిస్థితి గురించే అడుగుతున్నారని అన్నారు. పెట్టుబడులు రావడానికి ఇది కూడా ఒక ప్రధాన అంశమని, మూసీ ప్రక్షాళన జరిగి హైద్రాబాద్ చక్కగా కనబడితే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని చెప్పారు. ఒలంపిక్స్ కోసం పారిస్ వెళ్లిన సమయంలో అభివృద్ది చెందిన పెద్ద పెద్ద పట్టణాలన్ని చెరువుల పక్కనే ఉన్నట్లు గమనించానని అన్నారు. హైదరాబాద్ అన్ని రకాలుగా ఎదగాలన్న, మన పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం బాగుండాలన్నా ఇక్కడ ఒక మంచి వాతావరణం తీసుకొని రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ కార్యక్రమాలను కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియా ద్వారా తిరగరాసి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

పదేళ్లలో చేసిన అరాచకాన్ని గుర్తుచేసుకోండి

ఇవన్నీ వారికి తాత్కాలిక ఆనందాలను ఇవ్వచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలను 90 శాతం మంది ప్రజలు హర్షిస్తున్నారని, హైడ్రా విషయంలో ఎవరు ఉన్నా దాటుకొని ముందుకు పోవాలని చెబుతున్నారని అన్నారు. హైదరాబాద్ ను అభివృద్ది చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన హైదరాబాద్ కు పూర్వ వైభవం తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. హైద్రాబాద్ అభివృద్ది అంటే కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్, హరీష్ రావు, కవిత ల ఫామ్ హౌజ్ ల అభివృద్దేనా? కేసీఆర్ చెప్పాలన్నారు. చార్మినార్, ఓల్డ్ సిటీ ప్రాంతాలు అభివృద్ది చేయాలని మీకు ఎందుకు అనిపించలేదని, గత పదేళ్లలో ఓల్డ్ సిటీ అభివృద్దికి ఎంత ఖర్చు పెట్టారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నగరం సమూల అభివృద్దే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకు పోతుంటే ఏదో జరిగిపోయినట్లుగా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. హరీష్ రావు గతంలో మల్లన్న సాగర్ బాధితుల విషయంలో చేసిన అరాచకాన్ని గుర్తు చేసుకోవాలని దుయ్యబట్టారు. ఇక సిరిసిల్ల వీరుడు కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని, ఆయన స్నేహితులు.. ఇసుక దందాకు అడ్డు వచ్చినందుకు ఎరుకల భూమయ్య అనే వ్యక్తిని లారీతో తొక్కించారని, మహేశ్ అనే యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అతడు ఇప్పటికీ బాధపడుతున్నాడని, మీరు పదేళ్లలో చేసిన అరాచకాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. గత పదేళ్లపాటు నియంత పాలన జరిపి, రాష్ట్ర సంపదను దోచుకొన్నందుకే ప్రజలు మీకు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారని గుర్తుంచుకోవాలన్నారు.

అధికారం పోతే బ్రతకలేరా?

బీఆర్ఎస్ నాయకులకు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు జరిపే తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు పోస్టులను ప్రజలు నమ్మవద్దని, ప్రజల శ్రేయస్సు కోసమే కట్టుబడి ఉన్నామని, ఏ పేదవాడికి అన్యాయం జరగనివ్వమని తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని క్రైమ్ డీసీపీ కి లేఖ రాశామని, మా సోషల్ మీడియా విభాగం సోషల్ రెస్పాన్సిబిలిటీతో పని చేస్తుందని, అసత్య ప్రచారాలు చేయడం తమకు చేతకాదని చెప్పారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో మహిళ మంత్రికి చేనేత కార్మికులు తయారుచేసిన హారం వేస్తే దానిపై సిగ్గు లేకుండా.. సభ్యసమాజం తలదించుకునేలా పోస్టులు పెట్టి, ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీరు చేసే పనిని జంతువులు కూడా హర్షించవని, ఇంత దిగజారుడు రాజకీయాలు తగవన, అధికారం పోతే బ్రతకలేరా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేటీఆర్ హరీష్ రావు కనీసం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. రైతుల గురించి బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, బీఆర్ఎస్ గత పదేళ్లలో చేసిన రుణమాఫీ ఎంత? మేం తొమ్మిది మాసాల్లో చేసిన రుణమాఫీ వివరాలు బయటపెట్టాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ పై పెట్టిన పోస్టు పట్ల కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు స్పందించి, సమాధానం చెప్పాలని మహేశ్ కుమార్ డిమాండ్ చేశారు.


Similar News