కమీషన్ల తారక రామారావు ఏం సమాధానం చెబుతారు?
టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడమే సమస్యలకు శాశ్వత పరిష్కారమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడమే సమస్యలకు శాశ్వత పరిష్కారమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. టీఎస్పీఎస్సీని ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుందని విమర్శించారు. రాజకీయాల్లో పదవులు ఇవ్వలేని వారికి బోర్డు సభ్యులుగా నియమించారని మండిపడ్డారు. గుమస్తా స్థాయి లేని వారు గ్రూప్-1 పరీక్ష ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వంపై ద్వజమెత్తారు. పేపర్ లీకేజీ జరిగినప్పుడే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి అర్హులను నియమిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.
నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే శాశ్వత నియామకాలు లేవన్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణం సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అవకతవకలపై ఐటీ మంత్రిని అని చెప్పుకుంటున్న కమీషన్ల తారక రామారావు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. అయ్యకు కాళేశ్వరం.. కొడుక్కు టీఎస్పీఎస్సీ.. కవితకు సింగరేణి ఏటీఎం గా మారాయని విమర్శించారు. టీఎస్పీఎస్సీ అవకతవకల మూలాలు సీఎంవో అధికారన్నారు. రాజశేఖర్ రెడ్డి, లింగా రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. బోర్డును రద్దు చేయకుండా ప్రభుత్వం మొండిగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించిందన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని, పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తక్షణమే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాల్సిన బాధ్యత సీఎంపై లేదా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప, కనీస మానవత్వం లేదన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడుతుందని మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడిన కేసీఆర్‌ను గద్దె దించాలని, నిరుద్యోగుల నిరసనతో ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ కోదండరాం చెప్పినట్లు రహదారుల దిగ్బంధానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. పాలమూరు జిల్లాలో రహదారుల దిగ్బంధం చేసే బాధ్యత తాను, సంపత్ తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్, అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ముందుండి తుది దశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, తుది దశ తెలంగాణ ఉద్యమం తెలంగాణకు శాశ్వత పరిష్కారం చూపుతుందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.