TPCC Chief: కాంగ్రెస్ నామినేటెడ్ పోస్టులపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ నామినేటెడ్ పోస్టులపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించిందని దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి చూపించామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం చేసిందన్నారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో గాంధీభవన్ (Gandhi Bhavan) లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ నాయకులు, కార్యవర్గ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజా పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు. నియోజక వర్గాలలో సంబరాలు, రాష్ట్రంలో జరుగుతున్న కులగణనపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై డిస్కషన్ చేశారు.
ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేలా ప్రజల్లోకి:
ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టేలా తగిన విధంగా కాంగ్రెస్ ప్రచారం ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఇన్నాళ్లు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పూర్తిగా అవగాహన చేసుకొని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ, ఆర్టీసీలో మహిళలకు ఇచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు ((Indiramma Indlu)), ఫ్రీ కరెంట్, రూ.500 కే గ్యాస్, 50 వేల ఉద్యోగ నియామకాలుతో పాటు కాంగ్రెస్ చేసిన కార్యక్రమాల ఘనతను ఇంటింటికి ప్రతి కార్యకర్త తీసుకువెళ్లాలన్నారు. ఇప్పటికే అనే మందికి కార్పొరేషన్ పదవులు, డీసీసీ అధ్యక్ష, అనుబంధ సంఘాల చైర్మన్ పదవులు ఇచ్చాయని ఇంకా చాలా పదవులు ఇవ్వాల్సి ఉందన్నారు. పార్టీ కోసం పని చేసిన అందరికీ పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.