TPCC: ప్రభుత్వాన్ని కోర్టులు సమర్థించాయి.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమని, జీఓ 29 వల్ల రిజర్వేషన్ల అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమని, జీఓ 29 వల్ల రిజర్వేషన్ల అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలన్న మంచి ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయని, సుప్రీంకోర్టు తీర్పుతో విద్యార్థులు సంతోషంగా పరీక్షలు రాసుకోవాలని సూచించారు.
13 ఏళ్ల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చిందని, దానిని ఉపయోగించుకొని ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. అలాగే తాము మొదటి నుంచి గ్రూప్-1 విద్యార్థులకు అండగా ఉన్నామని, ఇదే విషయాన్ని పదే పదే చెపుతున్నామని అన్నారు. రిజర్వేషన్లకు ఎలాంటి అన్యాయం జరగదని ఒక బీసీ బిడ్డగా విద్యార్థులకు భరోసా ఇస్తున్నానని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ది కోసం గ్రూప్-1 విద్యార్థులను పావుగా వాడుకున్నాయని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి భవిష్యత్ బాగు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇక పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మహేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.