ఎమ్మెల్సీ పదవి ప్రకటిస్తాడేమో అని ఎదురుచూశాం: రేవంత్ రెడ్డి
అమరవీరులకు కేసీఆర్ నివాళిలో అడుగడుగునా కృత్రిమ భావన కనిపించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అమరవీరులకు కేసీఆర్ నివాళిలో అడుగడుగునా కృత్రిమ భావన కనిపించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. గురువారం జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు అయిన అమరవీరుల సంస్మరణ సభలో అమరవీరుల కుటుంబాలకు సత్కారాల నుంచి ఎలక్ట్రానిక్ కొవ్వొత్తుల ప్రదర్శన వరకు నిజాయితీ కొరవడిందని పేర్కొన్నారు.
‘ఎందరో ద్రోహులను అందలం ఎక్కించిన కేసీఆర్ నిన్న అమరవీరుల కుటుంబాల కోసం ఒక్క ఎమ్మెల్సీ పదవైనా ప్రకటిస్తాడేమోనని తెలంగాణ ఆశించింది’ అని వెల్లడించారు. ఇదిలా ఉండగా మరో ట్వీట్ చేస్తూ.. చరిత్ర అంటే గెలిచిన వాడిది కాదని, త్యాగం చేసిన వాడిదన్నారు. అమరవీరుల స్థూపంపై ఆ త్యాగధనుల పేర్లు రాయనప్పుడు, శిలాఫలకాలపై కేసీఆర్ పేరు మాత్రం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. అమరుల చరిత్రను సమిధ చేసి కల్వకుంట్ల చరిత్ర మాత్రమే తెలంగాణ చరిత్ర అన్నట్టు భ్రమింపజేసే కుట్ర ఇదని ట్వీట్ చేశారు.