విద్యార్థుల వెట్టి చాకిరిపై ఇదేం విచారణ డీసీవో సార్..? (వీడియో)
గాయం ఒక వద్ద అయితే మందు మరో దగ్గర రాయడం అన్న చందంగా బాధితులకు భరోసా ఇవ్వాల్సిన అధికారి, అన్యాయం చేస్తున్న వారికే అండగా నిలిచిన వైనం ఐనవోలు బీసీ బాలురు గురుకుల పాఠశాలలో జరిగింది.
దిశ, వరంగల్ బ్యూరో: గాయం ఒక వద్ద అయితే మందు మరో దగ్గర రాయడం అన్న చందంగా బాధితులకు భరోసా ఇవ్వాల్సిన అధికారి, అన్యాయం చేస్తున్న వారికే అండగా నిలిచిన వైనం ఐనవోలు బీసీ బాలురు గురుకుల పాఠశాలలో జరిగింది. సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ నెలల తరబడి విద్యార్థులతో వెట్టి చాకిరి చేయిస్తున్న తీరుపై ‘దిశ’ పత్రిక సాక్ష్యాధారాలు, వీడియోలు, పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్రచారి వివరణతో సమగ్రమైన కథనాన్ని మంగళవారం ప్రచురించింది. ఈ కథనాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. డీఆర్‌వో రాంరెడ్డి ఆదేశాలతో డీసీవో మనోహార్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం హాస్టల్‌ను పర్యవేక్షించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడిన తీరు, అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించిన విధానాన్ని బట్టి నామ్‌కే వాస్తేగా ఈ విచారణ కొనసాగించేందుకు వెళ్లారని స్పష్టమవుతోంది. పనిభారంతో విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న హాస్టల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, వార్డెన్‌లను కనీసం విచారణ చేయకపోవడం గమనార్హం.
ధికారులకు భరోసా ఇచ్చే రీతిలో డీసీవో విచారణ..?
ఐనవోలు బీసీ గురుకులంలో విద్యార్థులచే వెట్టి చాకిరి చేయిస్తున్నారంటూ దిశలో కథనం రావడంతో స్పందించిన ఉన్నతాధికారులు డీసీవో మనోహర్ రెడ్డి విచారణ బాధ్యతలు అప్పగించారు. మీడియాలో వచ్చిన కథనాలు, వీడియోలను ఆధారంగా చేసుకుని హాస్టల్ అధికారుల వైఫల్యాలను, విద్యార్థులతో పనిచేయిస్తున్న అధికారులపై చర్యలకు, హెచ్చరికలు చేయాల్సిన డీసీవో వారికే మద్దతుగా నిలవడం విస్తుగొల్పుతోంది. విద్యార్థుల్లో కొంతమందినైనా వన్ టు వన్‌గా విచారించాల్సింది పోయి.. నామ్ కేవాస్తేగా అంత బాగానే ఉందిగా.. భోజనం బాగానే పెడుతున్నారుగా అంటూ ముక్తాయింపు ప్రశ్నలు, విద్యార్థులచే అధికారులకు అనుకూలమైన సమాధానాలు రప్పించే ప్రశ్నలకే పరిమితమవడం జిల్లా స్థాయి అధికారి వైఖరిపై అనుమానాలు కలిగేలా చేస్తోంది. వెట్టిచాకిరిపై విచారణ చేయాల్సిన అధికారి ఆ విషయంపై రాలేదన్న రీతిలో అధికారులకు భరోసా ఇచ్చినట్లుగా వ్యహరించడం గమనార్హం.
వెట్టి చాకిరి చిన్న విషయమా సారూ..?
హాస్టల్‌లో విద్యార్థులు పూరీలు చేయడం, చెత్తను ఎత్తివేయడం, వంట చేయడం వంటి పనులన్నీ కూడా చాలా చిన్న విషయాలు అని డీసీవో మనోహర్ రెడ్డి హాస్టల్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చెప్పడం విశేషం. విద్యార్థులను చదువుకు దూరం చేస్తూ నెలలుగా, గంటల కొద్దీ పనులు చేయిస్తుండటం ఎలా చిన్న విషయం అవుతుందో డీసీవో సార్‌కే తెలియాలంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పనిలో పనిగా ఇలాంటి చిన్న చిన్న విషయాలపై వార్తలు రాయొద్దని, ముఖ్యంగా సోషల్ మీడియాలో అస్సలు పోస్ట్ చేయవద్దంటూ కూడా రెక్వెస్ట్, సలహాలివ్వడం సార్‌కే చెల్లింది. బీసీ గురుకులంలో విద్యార్థుల వెట్టి చాకిరి అంశం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారగా, సదరు శాఖ హాస్టల్ అధికారులు, బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులు మాత్రం చాలా చిన్న విషయంగా చూపించే ప్రయత్నం చేస్తూ పరస్పరం రక్షించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారు. హాస్టల్‌లో జరుగుతున్న అక్రమాల్లో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా జిల్లా స్థాయి అధికారులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ మేడం దృష్టి సారించేనా..?
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల బీసీ బాలుర గురుకులంలో జరుగుతున్న విద్యార్థుల వెట్టి చాకిరిపై కలెక్టర్ సిక్తాపట్నాయక్ స్పందించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా కలెక్టర్ స్పందించి ఓ కమిటీ వేసి విచారణ చేయిస్తే హాస్టల్‌లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విద్యావంతులు సూచిస్తున్నారు. కలెక్టర్ మేడం స్పందిస్తారో లేదో వేచి చూడాలి.