ఇదొక ఆర్టిఫిషియల్ బడ్జెట్: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్టిఫీషియల్ అంటూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా

Update: 2024-07-25 15:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్టిఫీషియల్ అంటూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అని చెప్పి.. ఇప్పుడు ఎలాంటి ప్రస్తావన చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. టెక్స్ టైల్ రంగానికి నిధులు ఇవ్వలేదని విమర్శలు చేశారని ఫైరయ్యారు. మంత్రి భట్టి బడ్జెట్ వట్టి బడ్జెట్టేనని ఆయన ఎద్దేవాచేశారు. దీనిపై సభలో సర్కార్‌ను ప్రశ్నిస్తామని పాల్వాయి తెలిపారు.

6 గ్యారెంటీలు, 420 హామీలు ఉత్తమాటలే: సూర్యనారాయణ గుప్తా

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఉత్తమాటలే అని బడ్జెట్ ద్వారా అర్థమవుతోందని బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శలు చేశారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. నిరుధ్యోగ భృతి, జాబ్ నోటిఫికేషన్ల ప్రస్తావన లేదన్నారు. రైతుభరోసాకు నిధులు లేవని, భట్టి బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరంతో తెలంగాణను దోచుకుంటే.. కాంగ్రెస్.. మూసీ పేరుతో దోచుకునే కుట్ర చేస్తోందని ఆరోపించారు.

అనంతరం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకానివేనని బడ్జెట్ ద్వారా తెలుస్తోందన్నారు. గత ప్రభుత్వం తోవలోనే అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఆదాయం ఎలా సమకూరుస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన డిక్లరేషన్లకు బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

వట్టిమాటల భట్టి బడ్జెట్: శిల్పారెడ్డి

భట్టి బడ్జెట్ వట్టిమాటల బడ్జెట్టేనని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విమర్శలు చేశారు. కాంగ్రెస్.. మహిళలకు ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలేసిందని ఫైరయ్యారు. మహిళలకు రూ.4 వేల పెన్షన్ ఎప్పటినుంచి ఇస్తారో చెప్పలేదని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ప్రస్తావనే లేదని ధ్వజమెత్తారు. విద్యార్థినులకు స్కూటీ, విద్యార్థినులకు రూ.5 లక్షల భరోసా కార్డు అడ్రస్ లేదని ఆమె ఎద్దేవాచేశారు.


Similar News