దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్ర ఒకపక్క అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 70 అడుగుల గణనాథుడి విగ్రహాన్ని కోలాహలంగా డప్పుల మోతలు, డీజే గానాబజానాల మధ్య ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం చేసేందుకు తీసుకెళుతున్నారు. దీంతో ఆ మార్గంలోని రహదారులన్నీ వేలమంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఇదే అదనుగా కేటుగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. ఖైరతాబాద్ గణేషుడి శోభయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులపై తమ చేతి వాటం చూపిస్తున్నారు.
పోలీసులు తెపిలిన వివరాల ప్రకారం.. గణపతి భక్తుడు బాబు వినోద్ అనే వ్యక్తి తన మెడలో మూడుతులాల చైన్ ధరించి వేడుకలు చూసేందుకు వచ్చాడు. అయితే ఇది గమనించిన ఓ దొంగ రద్దీలో దూరి ఆయన చైన్‌ను దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ విషయం వెంటనే గుర్తించిన వినోద్ అక్కడి పోలీసులకు చెప్పడంతో.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్నారు. కాగా.. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని లంగర్ హౌజ్ డిఫెన్స్ కాలనీకి చెందిన సల్మాన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడి నుంచి చైన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బాబు వినోద్‌కు అందజేశారు.