బాలవికాసలో అక్రమాలకు తావులేదు: సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి
బాల వికాస స్వచ్ఛంద సంస్థలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి స్పష్టం చేశారు.
దిశ, వరంగల్ బ్యూరో: బాల వికాస స్వచ్ఛంద సంస్థలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం వరకు బాలవికాస సంస్థలోని పలు కార్యాలయాల్లో తనిఖీ చేసిన విషయం తెలిసిందే. స్వచ్ఛంద సంస్థకు సంబంధించి కాజీపేటలోని ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ సహా 11 చోట్ల ఏకా కాలంలో సోదాలు జరిగినట్లు శౌరిరెడ్డి వివరించారు. సంస్థకు వస్తున్న నిధులు, ఖర్చుల వివరాలు, పథకాల అమలుకు చేస్తున్న వ్యయం తదితర ఆర్థిక అంశాలపై ఐటీ అధికారులు రికార్డులను పరిశీలించారని తెలిపారు.
తనిఖీల్లో భాగంగా సంస్థకు సంబంధించిన ఉద్యోగులు, డైరెక్టర్ లా ఖాతాలను కూడా పరిశీలించినట్లు తెలిపారు. రికార్డులన్నీ క్లియర్‌గా మెయిన్‌టెన్ చేసినట్లు తెలిపారు. ఐటీ అధికారులు సైతం ఆర్థిక లావాదేవీలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. పంచనామా నిర్వహించి కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమేనని అన్నారు.
ఆ ఆరోపణల్లో నిజం లేదు..!
45 సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలవికాస గత నాలుగేళ్లుగా విరాళాలు పెరిగిన మాట వాస్తవమేనన్నారు. నిధుల రాకతో పాటు అదే స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే సంస్థ ఆరంభం నుంచి ఇప్పటి వరకు రూ.450 కోట్ల విరాళాలు అందాయని అన్నారు. అయితే ఓ వైపు ఐటీ దాడులు జరుగుతున్న సమయంలోనే రూ.450 కోట్ల నిధులు మళ్లినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరగడం బాధించిందన్నారు. బాలవికాసలో ఇసుమంత కూడా అక్రమాలకు తావు లేకుండా నిర్వహణ జరుగుతోందన్నారు.