వర్కౌట్ కానీ రేవంత్ ‘బడే భాయ్’ వ్యూహం.. వృథాగా మారిన CM , మంత్రుల ఢిల్లీ వరుస టూర్స్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తెరపైకి తెచ్చిన ‘గాడిద గుడ్డు’ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Update: 2024-07-24 02:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తెరపైకి తెచ్చిన ‘గాడిద గుడ్డు’ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు నిధులేమీ కేటాయించలేదు. దీంతో తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి తెచ్చిన నిధులు ‘గాడిద గుడ్డు’ అంటూ విమర్శలు మొదలయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల కాలంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది ‘గుండు సున్నా’ అంటూ బీఆర్ఎస్ చాలా కాలంగానే విమర్శలు చేస్తున్నది. తాజా బడ్జెట్‌లోనూ తెలంగాణకు నిధులు లేకపోవడంతో మరోసారి ఆ అంశాన్ని కేటీఆర్ తెరమీదకు తెచ్చారు. సౌత్ ఇండియాలో పార్టీ విస్తరణకు తెలంగాణను ‘గేట్ వే’ అని బీజేపీ భావించి పొలిటికల్‌గా వాడుకున్నా.. బడ్జెట్‌లో ఎలాంటి ఫండ్స్ ఇవ్వకపోవడంపై రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారు. పొరుగు రాష్ట్రానికి ఇచ్చి తెలంగాణకు ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

బడ్జెట్‌పై అసంతృప్తి

ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉన్నదంటూ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీఎంలు, మంత్రులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానికి మొరపెట్టుకున్నారు. కేంద్ర మంత్రులనూ కలిసి మెమోరాండంలు సమర్పించారు. కానీ చాలా హామీలు, విజ్ఞప్తులు ఎక్కడి గొంగళి అక్కడ తరహాలోనే ఉండిపోయాయి. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, జిల్లాకో నవోదయ విద్యాలయ, సైనిక్ స్కూలు, ట్రైబల్ వర్సిటీకి నిధుల కేటాయింపు, వెనకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు, హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదల.. ఇలాంటి అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేదన్న అసంతృప్తితో ఉన్నారు. తాజా బడ్జెట్‌తో ఆ అసంతృప్తి కాస్తా ఆగ్రహం స్థాయికి చేరుకున్నది.

ప్రధానిని బడే భాయ్ అని సంబోధించినా..

‘ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ ప్రభావం కేంద్ర-రాష్ట్రాల మధ్య సంబంధాలపై పడకూడదు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించారు. సీఎం హోదాలో మూడుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేయాలని కోరారు. తెలంగాణ అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు ఆయనను ‘బడే భాయ్’ అని సంబోధించారు. బీఆర్ఎస్ నేతల నుంచి విమర్శలూ ఎదుర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, వివిధ మంత్రిత్వశాఖల నుంచి అనుమతులకు రాజకీయాలతో సంబంధం లేని తీరులో సీఎం, డిప్యూటీ సీఎంలు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి విన్నవించారు. బడ్జెట్ సన్నాహక సమావేశాలకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందించాల్సిన సహకారంపై నిర్మలా సీతారామన్‌కు వివరించారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఉండాలని, అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అయినా అవి మాటల దగ్గరే ఆగిపోయాయి.

విభజన చట్టంలో ఏపీకే ప్రాధాన్యం

విభజన చట్టంలో తెలంగాణకు, ఏపీకి స్పష్టమైన హామీలనే అప్పటి కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. కానీ ఏపీకి తాజా బడ్జెట్‌లో సహాయ సహకారాలు అందించినా తెలంగాణను విస్మరించడం చర్చనీయాంశమైంది. విభజన చట్టం ప్రకారం వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహకారం రెండు రాష్ట్రాలకూ నిర్దిష్టంగానే ఉన్నాయి. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు గత నాలుగేండ్లుగా రూ. 1,800 కోట్లను ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్‌లోనూ దాని ఊసెత్తలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు మాత్రం నిధులు అందజేస్తామంటూ ప్రకటించింది. నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఇచ్చిన బడ్జెట్ స్పీచ్‌లోని 62 పేజీల్లో ఒక్క చోట కూడా తెలంగాణ అనే పదాన్ని పలకలేదు. తొమ్మిది వెనకబడిన జిల్లాలకు ఆర్థిక సాయాన్ని మరో ఐదేండ్లు కొనసాగించాలని తెలంగాణ సీఎం ఇటీవలే రిక్వెస్టు చేసినా ఫలితం లేకపోయింది.

వరుస విజ్ఞప్తులకు నో రెస్పాన్స్

ప్రధాని మోడీని కలిసి అనేక అంశాలపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాల గురించి వివరించారు. కానీ ఇవన్నీ కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి తప్ప బడ్జెట్‌లో రిఫ్లెక్ట్ కాలేదు. విభజన చట్టం గడువు పదేండ్లతో ముగిసినా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం పెద్దన్న తరహా పాత్ర పోషించాలని, రాష్ట్రాలను సమదృష్టితో చూసి అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రాలు డెవలప్‌ అయితేనే కేంద్రం ఆశిస్తున్న ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ సాధ్యమవుతుందని.. ఇలాంటి అనేక అంశాలను సీఎం, డిప్యూటీ సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమపాళ్లలో అభివృద్ధి కావడానికి వీలుగా, గ్రామీణ ప్రాంత యువతకు వేర్వేరు రూపాల్లో ఉపాధి అవకాశాలు లభించే విధంగా బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ మొదలు ట్రైబల్ యూనివర్సిటీ, నవోదయ విద్యాలయాల వరకు విన్నవించారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందించిన తరహా సహకారమే తెలంగాణకు కూడా ఇచ్చినట్లయితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, వెనకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు, మొత్తం రాష్ట్రమే డెవలప్ కావడానికి దోహదపడుతుందన్నది సీఎం రేవంత్ భావన. కానీ ఆశించినవాటిలో ఒక్కటి కూడా బడ్జెట్‌లో కనిపించకపోవడంతో, తెలంగాణ పదాన్నే పలకకపోవడంతో ఢిల్లీ పర్యటనలు వృథాగా మారాయి. ఈ అనూహ్య పరిణామం రానున్న రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్‌కు దారితీసే అవకాశమున్నదనే చర్చ మొదలైంది. గత ప్రభుత్వంలోనూ కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం అందకపోగా హక్కులను హరిస్తున్నదనే వాదనతో కేంద్ర-రాష్ట్ర రిలేషన్స్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయ ప్రత్యర్థి సంబంధాలుగా మారిపోయాయి. తాజా బడ్జెట్‌తో మరోమారు అలాంటి పరిస్థితులే రిపీట్ అవుతాయేమోననే డిబేట్ మొదలైంది.


Similar News