డిపార్టుమెంటులో కనిపించని వివక్ష ఉంది: ఎస్సై మృతిపై ఆర్ఎస్పీ సంచలన ట్వీట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను మృతి చెందారు. ఇటీవల ఆయన మహబూబాబాద్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను మృతి చెందారు. ఇటీవల ఆయన మహబూబాబాద్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆయన ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. అంతులేని వివక్షకు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైందని సంచలన ట్వీట్ చేశారు.
ఏడు పోలీసు స్టేషన్లలో ఎస్సైగా పనిచేసిన ఒక ఆఫీసర్ కు, ఇద్దరు పిల్లల తండ్రికి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే డిపార్టుమెంటులో కనిపించని వివక్ష ఎంతో ఉందని, దాన్ని ఉన్నతాధికారులు క్రమశిక్షణ పేరుతో దాచిపెడతారని ఆరోపించారు. ఈ విషయాన్ని నాతో చాలా మంది పేద వర్గాలకు చెందిన పోలీసులు పంచుకున్నారని తెలిపారు. దీనికి అప్పుడప్పుడు పేద వర్గాల నుంచి, గాడ్ ఫాదర్లు లేని ఐపీఎస్ ఆఫీసర్లు కూడా బాధితులైతరన్నారు. వాళ్ల బాధలు వర్ణనాతీతం. వాళ్ల పేర్లు నేను చెప్పను, కాని చాలా మందికి తెలుసన్నారు. శ్రీరాముల శ్రీను విషయం లో కూడా మేం అడిగే దాకా ఎఫ్ఐఆర్ చేయలేదని, సీఎం ఈ కుటుంబానికి ఏం సమాధానం చెబుతారు? లేదా బడితే ఉన్నోనిదే బర్రె అంటరా? అని ఆర్ఎస్పీ స్పందించారు.