జూలై నెలాఖరులోగా అక్కడ కొత్త రూల్.. ప్రముఖ పర్యాటక ప్రాంతంపై సీఎస్ కీలక ఆదేశాలు

సీఎస్ శాంతికుమారి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Update: 2024-05-29 11:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అమ్రబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు కీలక అప్ డేట్. ఇక్కడ ప్లాస్టిక్ నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెలాఖరులోగా 'అమ్రాబాద్ టైగర్ రిజర్వ్' ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో శాంతి కుమారి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి అడ్డుకట్ట వేసే విషయంలో అధికారులతో చర్చలు జరిపి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కాగితపు సంచలులు, గుడ్డ/జనపనార సంచులు, విస్తరాకులు వంటి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని, వీటిపై ప్రజలకు, ఆ ప్రాంతంలోని వ్యాపారులకు అవహగాన కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్ నివారించే ప్రయత్నాల్లో భాగంగా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ప్రసార మాధ్యమాల్లో ప్రచారంతో పాటు పంచాయతీ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ఈ విషయం ప్రజలకు చేరవేయాలన్నారు. అలాగే అమ్రబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసం ఉంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 'మైసమ్మ దేవాలయం'లో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్‌ శాఖ అధికారులను సీఎస్‌ కోరారు.

Tags:    

Similar News