రెవెన్యూలోకి తీసుకోవాలని ధరణి కమిటీని కోరిన వీఆర్వోలు

పూర్వ వీఆర్వోలను నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థ బలోపేతంలో భాగంగా తమను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం కోరింది.

Update: 2024-06-25 14:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పూర్వ వీఆర్వోలను నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థ బలోపేతంలో భాగంగా తమను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు మంగళవారం రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ, ధరణి కమిటీ సభ్యులు ఎం.సునీల్ కుమార్ లను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. తమ అనుభవాలను, సర్వీసుని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వీఆర్వోల పే ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్, కామన్ సీనియారిటీ ద్వారా రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని, పదోన్నతులు కల్పించాలన్నారు. తమను ఈ శాఖలోకి తీసుకోవడం ద్వారానే సమస్త సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఈ అంశాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని లచ్చిరెడ్డి వారికి హామీ ఇచ్చారు. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి తమను రీ డెప్లాయ్ చేయాలని ధరణి కమిటీ సునీల్‌ని కోరారు.

 జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కంటే తక్కువ క్యాడర్ లో సర్దుబాటు చేయబడ్డామని, సొంత జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలోకి కుటుంబ సభ్యులకు దూరంగా, వందల కి.మీ. దూరంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సాంక్షన్డు క్లియర్ వెకెన్సీ పోస్టులోకి కాకుండా అటెండర్, కామాటి, వంట కుక్ , తోటమాలి, వార్డు ఆఫీసర్, టైపిస్ట్, జూనియర్, సీనియర్ స్టెనోలుగా, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులలోకి లాటరీ పద్ధతిలో బలవంతపు సర్దుబాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వోల సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా, ఉద్యోగ హక్కులు, మానవ హక్కులకు భంగం కలిగిందన్నారు. వీఆర్వోల సమస్యల పరిష్కారానికి ధరణి కమిటీ ద్వారా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు, బంకా కృష్ణ, రాఘవేంద్రరావు, ఇఫ్తాకర్, తదితరులు పాల్గొన్నారు.


Similar News