కాంగ్రెస్‌లో YSRTP విలీనానికి ముహూర్తం ఫిక్స్.. ఆ నియోజకవర్గం నుండే YS షర్మిల పోటీ..?

కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సెప్టెంబర్ మొదటివారంలో పార్టీ విలీన ప్రక్రియ పూర్తికానున్నట్లు సమాచారం.

Update: 2023-09-01 03:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సెప్టెంబర్ మొదటివారంలో పార్టీ విలీన ప్రక్రియ పూర్తికానున్నట్లు సమాచారం. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ రెండో తేదీన పార్టీ చీఫ్ షర్మిల ఇడుపుల పాయకు వెళ్లనున్నారు. తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఆ తర్వాతే ఏ క్షణాన్నయినా పార్టీని విలీనం చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

కాగా, షర్మిల కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ కాగా, వారి నుంచి స్పష్టమైన హామీ లభించాకే హైదరాబాద్‌కు తిరుగుపయనమైనట్లు తెలిసింది. కొద్ది నెలల్లో ఎన్నికలున్న తెలంగాణలోనే షర్మిల సేవలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లోనూ షర్మిల సేవలను వినియోగించుకోవాలని పార్టీ భావిస్తున్నది. అన్నపై యుద్ధానికి చెల్లెను కాంగ్రెస్ అస్త్రంగా దింపాలని, దీంతో పార్టీకి జవసత్వాలు వస్తాయని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పినా..

రాజన్న సంక్షేమ పాలనే లక్ష్యంగా వైఎస్సార్టీపీని స్థాపించిన షర్మిల రెండేండ్లలోనే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుండడం గమనార్హం. అయితే షర్మిల కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి నష్టమని తెలంగాణ రాష్ట్ర నేతలు హైకమాండ్‌కు పలు నివేదికలు పంపించారు. దీంతో ఆమె కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఆయన మధ్యవర్తిత్వంతో హై కమాండ్‌ను అప్రోచ్ అయ్యారు. అయితే షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకుంటామని అధిష్టానం స్పష్టం చేసింది.

షర్మిల మాత్రం తెలంగాణ పాలిటిక్స్ పైనే ఇంట్రస్ట్ చూపారు. దీంతో పార్టీ విలీనంపై ఇన్నాళ్లు తాత్సారం జరిగింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆలస్యం చేస్తే ఇబ్బంది తప్పదని భావించిన షర్మిల ఈసారి భర్త అనిల్‌తో కలిసి నేరుగా సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అయినట్లు తెలిసింది. తెలంగాణలో తన సేవలను వినియోగించుకోవాలనే హైకమాండ్ పూర్తి హామీ ఇచ్చాకే రిటర్న్ అయినట్లు సమాచారం. అందుకే కేసీఆర్‌కు కౌంట్ డౌన్ మొదలైందనే వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది.

వైఎస్సార్టీపీ నేతల్లో అసంతృప్తి..!

షర్మిల నేరుగా ఢిల్లీకి వెళ్లి పార్టీ విలీనం అంశంపై చర్చలు జరుపుకుని రావడంతో సొంత పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. షర్మిల తీరు కారణంగా పార్టీ సీనియర్ లీడర్ కొండా రాఘవరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పటు పలువురు నేతలు సైతం షర్మిలపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది. తుంగతుర్తి వైఎస్సార్టీపీ అభ్యర్థిగా ఏపూరి సోమన్నను షర్మిల అనౌన్స్ చేశారు. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. నమ్ముకుని వస్తే మోసం చేశారని షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌పై అభియోగాలు మోపిన, జగన్‌ను జైల్లో పెట్టిన పార్టీతో చర్చలు ఎలా జరుపుతారని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం ఎన్నో కష్టనష్టాలు భరించామని, ఎంతో ఖర్చు చేసుకున్నామని, ఇప్పుడు పార్టీ విలీనం చేస్తే ఎలా అని పలువురు నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాఘవరెడ్డి రాజీనామాపై షర్మిల ఘాటుగానే స్పందించారు. రాఘవరెడ్డి అసలు పార్టీలోనే లేరని, అలాంటిది రాజీనామా చేయడమేంటని పేర్కొన్నారు.

పోటీ ఎక్కడి నుంచి..?

పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలో షర్మిల ప్రకటించారు. అయితే పార్టీని విలీనం చేసిన తర్వాత షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్‌లో టికెట్ దక్కని తుమ్మల నాగేశ్వర్ రావును కాంగ్రెస్‌లోకి లాగాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఏకంగా తుమ్మల నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఒకవేళ పాలేరు సీటును తుమ్మలకు కేటాయిస్తే షర్మిల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. సికింద్రాబాద్ టికెట్ ఇస్తారా? లేక మరోచోట ఎక్కడైనా అవకాశమిస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది.

ఇదిలాఉండగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, షర్మిలకు ఏమాత్రం పొసగడం లేదు. గతంలో నుంచే పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాలు నిప్పు, ఉప్పగా మారాయి. షర్మిల పాలేరు నుంచి పోటీకి దిగకుండా ఆమెకు చెక్ పెట్టేందుకే రేవంత్ తుమ్మలను కాంగ్రెస్ గూటికి చేర్చుకోవాలనుకుంటున్నారని తెలుస్తున్నది. తాజాగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నపై షర్మిల స్పందించకపోవడంతో మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News