మీకు అవసరం ఉన్నప్పుడే CC కెమెరాలు పనిచేస్తాయా..? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాల నిర్వహణకు సంబంధించి హైకోర్టు గురువారం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాల నిర్వహణకు సంబంధించి హైకోర్టు గురువారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీకు అవసరమైనపుడే సీసీ కెమెరాలు పని చేస్తాయా? అంటూ పోలీసు శాఖను ప్రశ్నించింది. మీకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే సీసీ కెమెరాలు పనిచేయవా? అంటూ వ్యాఖ్యానించింది. సీసీ కెమెరాల ఫుటేజీని ఆరు నెలల పాటు భద్రపరచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నారా? లేదా? అని నిలదీసింది. నాగర్కర్నూల్జిల్లా తిమ్మాజీపేట పోలీస్స్టేషన్ఎస్ఐ తనను విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారంటూ మాధవులు అనే వ్యక్తి జిల్లా ఎస్పీకి కొంతకాలం క్రితం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎస్పీ స్పందించక పోవటంతో మాధవులు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు.
జస్టిస్చంద్రయ్య బదిలీ తరువాత మానవ హక్కుల సంఘం ఛైర్మన్ స్థానంలో ప్రభుత్వం కొత్తవారిని నియమించలేదు. దాంతో మాధవులు హైకోర్టులో పిటీషన్దాఖలు చేశారు. దీనిపై జస్టిస్కె.లలిత ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సీసీ కెమెరాల ఫుటేజీని న్యాయస్థానానికి అంద చేయాలని సూచించింది. అయితే, సీసీ కెమెరాలు పనిచేయటం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. మీకు అవసరమైనపుడు సీసీ కెమెరాలు పనిచేస్తాయి.. పోలీసులు ఇరుక్కునే పరిస్థితి వచ్చినపుడు మాత్రం పనిచేయవు అంటూ జస్టిస్వ్యాఖ్యానించారు. ఆరు నెలలపాటు సీసీ కెమెరాల ఫుటేజీని అందుబాటులో ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు గుర్తున్నాయా? అని ప్రశ్నించారు.
ప్రస్తుత కేసులో పిటీషనర్‌ను చితకబాదారన్న ఆరోపణలున్నాయి, దీనికి సీసీ టీవీ ఫుటేజ్కీలక ఆధారం, ఈ కేసులో ఫుటేజ్లేకుండా చేయటానికి చూస్తున్నట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. నాగర్కర్నూల్ఎస్పీ స్వయంగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రాష్ర్టంలోని అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాల నిర్వహణపై డీజీపీ సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.