ప్రశ్నార్థకంగా మారిన బీఆర్ఎస్ మనుగడ.. ఇక కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందేనా?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహకు అందని తీరులో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది.

Update: 2023-12-25 02:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహకు అందని తీరులో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. ఒకవైపు ఎంపీలుగా పోటీ చేయడానికి చాలా మంది సిట్టింగ్‌లు ఆసక్తిగా లేరు. మరోవైపు కచ్చితంగా గెలుస్తారనే కాన్ఫిడెన్సు ఉన్న లీడర్ల కోసం అధిష్టానం వెతుకుతున్నది. పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ పట్టు కోల్పోయిన పరిస్థితుల్లో ఎంపీ ఎన్నికల్లో గెలుపు ఆందోళన రేకెత్తిస్తున్నది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగితే తప్ప పార్టీ మనుగడ కష్టమేననే అభిప్రాయం కేడర్‌లో వ్యక్తమవుతున్నది. డీమోరల్ కాకుండా వారిని నిలబెట్టుకోవడం పార్టీకి తక్షణావసరంగా మారింది.

తుంటి ఎముక రీప్లేస్‌మెంట్ సర్జరీతో విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ రెండు, మూడు వారాల తర్వాత మళ్లీ బయటకు వస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పార్టీ భవిష్యత్తు ఆయనతోనే సాధ్యమనే ఆశతో ఉన్నాయి. బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా విస్తరించడానికి గతంలో అధినేత చాలా ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అభ్యర్థులను నిలబెడతారా? అనే చర్చ ఆ పార్టీలో జోరందుకున్నది. సింగరేణి ఎన్నికల్లో దాదాపుగా వెనకడుగు వేసిన గులాబీ పార్టీ.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. కేసీఆర్ పోటీ చేయడం ఎలా ఉన్నా ఇతర రాష్ట్రాల్లో పార్టీ వైఖరి ఏంటనేది కీలకంగా మారింది.

ఈ సారి కష్టమే..

ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి పలు జిల్లాల్లో బీజేపీ గతం కన్నా బలపడినట్టు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ ఒక అంచనాకు వచ్చింది. ఆ పార్టీ గెల్చుకున్న మొత్తం 8 స్థానాల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ ఆ జిల్లాలకు చెందిన నియోజకవర్గాలే. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రమే గులాబీ పార్టీకి ఎంతో కొంత పట్టు ఉన్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు అనే స్లోగన్‌ను అందుకున్నా చివరకు తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి ఎన్ని స్థానాల్లో గెలుస్తామో అనే అనుమానం ఆ పార్టీ లీడర్లను వెంటాడుతున్నది.

దక్షిణాదిన కాంగ్రెస్ హవా

దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ చేయడంతో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే రిపీట్ కావచ్చనే అనుమానాలు బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలవకపోయినా.. లోక్‌సభ స్థానం సిట్టింగ్ కావడంతో ఈ సారీ సైతం కైవశం చేసుకుంటుందనే చర్చ జరుగుతున్నది. స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో పబ్లిక్ మూడ్ ఎలా ఉన్నా ఎంపీ ఎలక్షన్స్ విషయంలో మాత్రం డిఫరెంట్‌గా ఉంటుందని జిల్లా స్థాయి గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎఫెక్టు కచ్చితంగా ఉంటుందని, దీనికి తోడు జాతీయ స్థాయి ప్రభావం దృష్ట్యా అధికారంలో లేని తమ పార్టీకి అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చనే నిరుత్సాహమూ వ్యక్తమవుతున్నది. కేటీఆర్, హరీశ్‌‌రావు పార్టీ యాక్టివిటీస్‌లో ఉన్నప్పటికీ శ్రేణుల్లో మాత్రం తిరిగి పూర్వ వైభవం వస్తుందనే ధీమా లేదు. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగితే కొంత మార్పు కనిపిస్తుందేమోగానీ గతంలో గెల్చుకున్న స్థాయిలో తొమ్మిది సీట్లు మాత్రం కష్టమేననే మాటలు వినిపిస్తున్నాయి. సొంత రాష్ట్రంలోనే పరాభావాన్ని మూటగట్టుకున్నందున ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తారో లేదో ఆ పార్టీ నేతలకే క్లారిటీ లేదు.

మహారాష్ట్రలో పోటీపై మల్లగుల్లాలు?

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్ని స్థానాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ నిలబెట్టాలనే చర్చ ఎలాగూ ఉన్నది. పంచాయతీ ఎన్నికల్లో తొమ్మిది వార్డు సభ్యులు మాత్రమే గెలుపొందిన పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికల్లో కనీసం డిపాజిట్ దక్కుతుందో లేదో అనే గుసగుసలు ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. కచ్చితంగా పోటీ చేయాల్సిందేనని అక్కడి బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు. గెలుస్తామని కాన్ఫిడెన్సు లెవల్స్ వారిలో ఎలా ఉన్నా ‘ఓడిపోతే.. డిపాజిట్ కూడా రాకపోతే..’ అనే అంశాలు స్పష్టమైన నిర్ణయం తీసుకోడానికి ఇబ్బంది పెడుతున్నాయి. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆ పార్టీ నేతల్లో ఆసక్తికరంగా మారింది. దాదాపు రెండు వారాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఢీకొట్టడం, అసెంబ్లీలో గట్టిగా వాదనలు వినిపించడం, వైట్‌పేపర్‌ల విషయంలో ఆ పార్టీ పన్నిన ఉచ్చులో చిక్కుకోవడం.. ఇలాంటి పరిణామాల్లో కేటీఆర్, హరీశ్‌రావు పోషించిన పాత్రను కేసీఆర్ స్టడీ చేశారని, మళ్లీ పార్టీ పెద్దగా రంగంలోకి దిగకపోతే శ్రేణులను నిలబెట్టుకోవడం సైతం కష్టమే అనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కావడం మినహా పార్టీ మనుగడకు మరో మార్గం లేదనేది ఆ పార్టీ నేతల భావన. రాబోయే రెండు మూడు వారాల్లో కేసీఆర్ రంగంలోకి దిగడంపైనే ఆశలు పెట్టుకున్నారు.

Tags:    

Similar News