రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ.. ప్రధాన ఎజెండా అంశం ఇదే..!

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం సచివాలయంలో శుక్రవారం జరగనున్నది.

Update: 2024-06-20 02:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం సచివాలయంలో శుక్రవారం జరగనున్నది. పంద్రాగస్టుకల్లా రైతులకు రుణమాఫీ కంప్లీట్ చేస్తామని సీఎం సహా పలువురు మంత్రులు గతంలో అనేక సందర్భాల్లో ప్రకటన చేయడంతో ఈ సమావేశంలో ఈ అంశంపై లోతుగా చర్చ జరగనున్నది. కటాఫ్ డేట్‌ను నిర్ణయించడం, విధివిధానాల రూపకల్పన, లబ్ధిదారుల అర్హతలను ఖరారు చేయడం, పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవడం, ఎప్పటి నుంచి అమలు చేయాలి..ఇలాంటి అనేక అంశాలపై ఈ మీటింగ్‌లో చర్చ జరగనున్నది. మంత్రులందరి అభిప్రాయాలకు అనుగుణంగా కేబినెట్‌లో నిర్ణయం ఖరారు కానున్నది. ఇప్పటికే స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీతో చర్చలు జరిపిన ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నది.

వెల్లడి కానున్న మంత్రుల ఒపీనియన్స్

రైతు రుణమాఫీ ఒకే విడతలో అమలు చేయడం అసాధ్యమంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాలు కూడా విసిరారు. ఆర్థిక వనరుల సమీకరణపై గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం పంద్రాగస్టుకు కంప్లీట్ చేసేందుకుగాను వచ్చే నెల చివరిలోనే లాంఛనంగా ప్రారంభించనున్నట్టు అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపైన కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. గత ప్రభుత్వంలో ఈ స్కీమ్‌ పాక్షికంగానే అమలుకావడంతో ఫలాలు అందుకోలేకపోయిన అర్హులైన రైతులకు కూడా ఇప్పుడు అందజేయాలన్న విజ్ఞప్తుల నేపథ్యంలో కేబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది. ప్రధానమంత్రి కిసాన్ యోజనకు రూపొందించిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నందున మంత్రుల అభిప్రాయాలు కూడా ఈ మీటింగ్‌లో వెల్లడి కానున్నాయి.

పరిహార చెల్లింపుపై రానున్న స్పష్టత

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సీఎం మొదలు ఎమ్మెల్యే వరకు ప్రజాప్రతినిధులు..ఇలాంటి కొన్ని కేటగిరీలను ఎంపిక చేసి ఈ స్కీమ్ లబ్ధి నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఆదాయపు పన్ను రిటన్‌లు సమర్పించిన వారిని అర్హులుగానే పరిగణించాలన్న అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. వీటన్నింటి నేపథ్యంలో కేబినెట్‌లో ఈ అంశంపై లోతుగా చర్చ జరిగిన అనంతరం ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుని ప్రకటించనున్నది. మరోవైపు రానున్న సీజన్‌కు ఇవ్వాల్సిన రైతుబంధు/రైతుభరోసా, నిబంధనలు, ఆంక్షలు, వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు తదితరాలపైనా ఈ సమావేశం ఒక స్పష్టతకు రానున్నది.

ఎజెండా అంశాలపై లోతుగా చర్చించే చాన్స్

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపైనా కూడా కేబినెట్ చర్చించనున్నది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సెషన్‌ను ఫిబ్రవరి 10న నిర్వహించడంతో సభ నుంచి లభించిన ఆమోదం జూలై 31కి కంప్లీట్ అవుతున్నందున వర్షాకాల సమావేశాలను పెట్టి పూర్తి బడ్జెట్‌కు ఆమోదం పొందాల్సి ఉన్నది. ఎప్పటి నుంచి నిర్వహించాలో, ఎన్ని రోజులపాటు జరపాల్సిన అవసరం ఉంటుందో.. తదితర అంశాలను కూడా కేబినెట్ చర్చించి ప్రాథమిక నిర్ణయం తీసుకోనున్నది. సచివాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఎజెండాలో అంశాలు తక్కువగానే ఉన్నా లోతుగా చర్చించనున్నట్టు అధికార వర్గాల సమాచారం.


Similar News