వరంగల్లో మిస్సింగ్.. హైదరాబాద్ లో గుర్తింపు.. 5 రోజుల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం

వరంగల్లో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన 5 రోజుల పసికందును హైదరాబాద్ లో గుర్తించారు పోలీసులు.

Update: 2024-09-09 15:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్లో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన 5 రోజుల పసికందును హైదరాబాద్ లో గుర్తించారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 4న మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆసిఫాబాద్ కు చెందిన భీంబాయి ఆడశిశువును ప్రసవించింది. అయితే ఏడు నెలలకే డెలివరీ అవడంతో.. మెరుగైన వైద్యం కోసం వైద్యులు వరంగల్ సికేఎమ్ ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రికి రిఫర్ చేయగా.. వారు పసికందును వరంగల్ కు తీసుకు వచ్చారు. కాగా అక్కడ తమ వారిని కలవడానికి వచ్చిన ఓ మహిళ భీంబాయితో మాటలు కలిపింది. ఈ నెల 7న నిద్రిస్తున్న సమయంలో తల్లి ఒడినుండి పసికందును ఆ మహిళ అపహరించింది. ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు పోలీసు కంప్లైంట్ ఇవ్వగా.. సీసీ ఫుటేజీ ఆధారంగా మహిళ ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. చివరికి ఆ పసికందు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో ఉన్నట్టు గుర్తించారు. సదరు మహిళను అదుపులోకి తీసుకొని, పసికందును క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఈ కిడ్నాప్ వెనుక ఉన్న ముఠా గురించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు. తమ బిడ్డను తమ చెంతకు చేర్చిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.      


Similar News