అమెరికా నుంచి హైదరాబాద్ కు నేరుగా విమాన సర్వీస్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎన్నారైల వినతి
హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి యూఎస్ఏ ఎన్నారైలు మెమోరాండం సమర్పించారు.
దిశ , తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి యూఎస్ఏ ఎన్నారైలు మెమోరాండం సమర్పించారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు కలిసి విన్నవించారు. ఢిల్లీ , ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్‌లను కలిగి ఉన్నాయని, అమెరికా నుండి హైదరాబాద్‌కు నేరుగా విమానాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇతర పెద్ద పట్టణాలకు సమాంతర అభివృద్ది సాధ్యమౌతుందని ప్రవాసులు అన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ ఆకర్షిస్తుందని తెలిపారు. ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయటంతో పాటు, కొత్త రూట్లలో విమాన సర్వీసులను తెచ్చేందుకు కృషి చేస్తోందని, కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో అమెరికాలో ఉన్న ప్రవాస తెలంగాణ వాదులు, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీఎఫ్ మాజీ అధ్యక్షులు మురళీ చింతలపాని, లక్ష్మణ్ అనుగు, ఇతర కార్యవర్గసభ్యులు కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణ వాసులు, ముఖ్యంగా టీడీఎఫ్ పోషించిన పాత్రను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అభినందించారు. విలాస్ జంబుల, లక్ష్మణ్ అనుగు, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, ప్రదీప్ కట్టా, వంశీ యమజాల, మధుకర్ రెడ్డి, రామ్ వేముల, రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్ దార్గుల తదితరులు మెమోరాండం సమర్పించిన వారిలో ఉన్నారు.