తాజా.. మాజీల గురి పినపాకపైనే..?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంపైనే అందరి ఫోకస్. ఈసారి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పినపాకపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు అర్థమవుతోంది.

Update: 2022-12-26 17:33 GMT

దిశ , మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంపైనే అందరి ఫోకస్. ఈసారి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పినపాకపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు అర్థమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బూర్గంపాడు నియోజవర్గంగా ఉన్నప్పుడు 2004 లో పాయం వెంకటేశ్వర్లు సీపీఐ పార్టీ నుంచి గెలుపొందారు. 2009లో పినపాక నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో రేగా కాంతారావు తొలిసారిగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 లో పాయం వెంకటేశ్వర్లు రెండోసారి వైఎస్ఆర్ సీపీ నుంచి గెలిచినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ లో చేరారు. 2018లో రెండోసారి కూడా కాంగ్రెస్ నుంచే గెలిచిన రేగా కాంతారావు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో చేరి ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. చిత్రమేమిటంటే రెండో సారి గెలిచిన పాయం వెంకటేశ్వర్లు, రేగా కాంతారావులు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పైనే విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తాజా ఎమ్మెల్యే రేగా కాంతారావులు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునాతీరే.

మూడోసారి గెలుపుకోసం ఇద్దరి ఫోకస్ పినపాకపైనే..?

ఎమ్మెల్యేగా రేగా కాంతారావు ఈసారి అధికార పార్టీ నుంచి పోటీ చేసినట్లయితే మాజీ ఎమ్మెల్యే మరి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితులుగా పాయం వెంకటేశ్వర్లు ఆయనే వెంటే ఉంటున్నారు. కొంతకాలంగా పినపాక నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, రేగా కాంతారావుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. కొంతమంది బీజేపీలో చేరుతారని, మరికొందరు కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇప్పటికీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడా కూడా పార్టీ మారుతున్నట్లు చెప్పలేదు. బీఆర్ఎస్ లోనే ఉన్నానని.. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటే ఉండే మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావులు మూడోసారి పినపాక పగ్గాలు చేపట్టేందుకే ఫోకస్ పెట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

Tags:    

Similar News