బీఆర్ఎస్‌కు ఎన్నికల అస్త్రంగా పోడు భూముల సమస్య!

పోడు రైతులకు హక్కు పత్రాల పంపిణీ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు నీటిమీద రాతలుగానే మిగిలి పోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2023-04-03 07:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పోడు రైతులకు హక్కు పత్రాల పంపిణీ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు నీటిమీద రాతలుగానే మిగిలి పోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు ప్రభుత్వ వైఖరి చూస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్దిదారులకు హక్కు పత్రాలు అందజేయడంపై కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నట్లు స్పష్టం అవుతోందని ధ్వజమెత్తారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖను రాశారు.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో పోడు భూముల సమస్యను అస్త్రంగా వాడుకుని ఆ తర్వాత విస్మరించడాన్ని గిరిజనులు క్షమించరని అన్నారు. తాను చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా అనేక మంది గిరిజనులు పోడు భూముల సమస్యను తన వద్ద ప్రస్తావించారని వాటినే కాంగ్రెస్ పక్షాన తాను మీ దృష్టికి తీసుకు వచ్చేందుకు ఈ లేఖను చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సమస్యపై మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్‌గా అటవీ, రెవెన్యూ శాఖ మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. పోడు భూముల పట్టాలకు సంబంధించిన వాస్తవ లెక్కలను ప్రభుత్వం మరుగున ఉంచుతోందని విమర్శించారు. రాష్ట్రంలో 4 లక్షల మందికిపైగా గిరిజన రైతులు పట్టాల కోసం ఎదురు చూస్తుంటే 1.5 లక్షల మందికే పట్టాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం గిరిజనులను నిలువునా మోసగించడమే అవుతుందని, ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఖండిస్తోందన్నారు.

పోడు భూముల సాగు కోసం ఎన్ని లక్షల ఎకరాలపై ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో జిల్లాలు, మండలాలు గ్రామాల వారీగా జాబితా విడుదల చేయాల చేసి.. గిరిజనులు, ఆదివాసీలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీ పోడు రైతుల పక్షాన పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు.

Tags:    

Similar News