పాతిక మందిని ప్రశ్నించనున్న ‘కాళేశ్వరం కమిషన్’.. పొలిటికల్ లీడర్లకూ నోటీసులు!

దాదాపు మూడు వారాల విరామం తర్వాత కాళేశ్వరం కమిషన్ మళ్లీ ఓపెన్ హౌజ్ ఎంక్వయిరీ మొదలుపెట్టనున్నది.

Update: 2024-09-20 02:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు మూడు వారాల విరామం తర్వాత కాళేశ్వరం కమిషన్ మళ్లీ ఓపెన్ హౌజ్ ఎంక్వయిరీ మొదలుపెట్టనున్నది. గత నెలలో పదిహేను మంది ఇంజినీర్లు, రిటైర్డ్ అధికారులను విచారించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్.. ఈ వారం దాదాపు పాతిక మందిని ప్రశ్నించనున్నది. గతంలో కమిషన్‌ను కలిసి వివరాలు అందించి వాటిని అఫిడవిట్ రూపంలో అందించిన నిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్లందరినీ ఓపెన్ హౌజ్ ఎంక్వయిరీ ద్వారా విచారించడానికి సన్నద్ధమవుతున్నది. అందులో భాగంగా శుక్రవారం ఏడుగురిని ప్రశ్నించనున్నది. రీసెర్చ్ నిపుణులు, చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారులతో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను సైతం ప్రశ్నించనున్నది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన టెక్నికల్ అంశాలపైనే కమిషన్ ఫోకస్ పెట్టనున్నది. అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపైనే ప్రధాన దృష్టి సారించే కమిషన్.. గతంలో ఇంజినీర్లు వెలిబుచ్చిన వివరాల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నది.

సోమేశ్ కుమార్ నుంచి అందిన అఫిడవిట్!

ఇప్పటివరకు కమిషన్ ముందు వివరాలు ఇవ్వడానికి హాజరైన దాదాపు 58 మంది నుంచీ అఫిడవిట్లు అందినట్లు కమిషన్ వర్గాల సమాచారం. గతంలో ఇరిగేషన్ శాఖ సెక్రెటరీగా బాధ్యతలు చూసి ఆ తర్వాత సీఎస్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ నుంచి కూడా అఫిడవిట్ కమిషన్‌కు అందినట్లు తెలిసింది. దీంతో ఇక అఫిడవిట్ ఇవ్వాల్సింది ఒక్క నిపుణుడు మాత్రమేనని సమాచారం. అఫిడవిట్ ఇచ్చినవారందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేసేలా షెడ్యూలు రూపొందించుకున్న కమిషన్.. ఫస్ట్ ఫేజ్‌లో టెక్నికల్ అంశాలపైనే ఆరా తీయనున్నది. ఈ ఫేజ్ ముగిసిన తర్వాత ఆర్థిక అంశాల లోతుల్లోకి వెళ్లనున్నది. క్రాస్ ఎగ్జామినేషన్ అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక లాయర్‌ను నియమించాల్సిందిగా గతంలో ప్రభుత్వానికి కమిషన్ విజ్ఞప్తి చేయగా సానుకూల స్పందనే వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన లాయర్‌ను కమిషన్ ఎంపిక చేసుకునే అవకాశమున్నది.

ఆర్థిక అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమయ్యేనాటికి ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్ కూడా కమిషన్‌కు సహాయంగా ఉండేందుకు ప్రభుత్వం నియమించే అవకాశమున్నది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు జరిగిన డ్యామేజీని ఇప్పటికే పుణెకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చి స్టేషన్ నిపుణులతోపాటు ఢిల్లీలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు సైతం అధ్యయనం చేసి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఫైనల్ రిపోర్టును సమర్పించాల్సిందిగా కమిషన్ గతంలోనే లేఖలు రాయడంతో త్వరలోనే అందనున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర పరిధిలోని విజిలెన్స్ కమిషన్ పూర్తిస్థాయి నివేదిక సైతం తొందర్లోనే కమిషన్‌కు చేరనున్నట్లు తెలిసింది. టెక్నికల్ అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత ఆర్థిక అంశాలపై ప్రాసెస్ మొదలుపెట్టే సమయానికి పాలసీకి సంబంధించిన విషయాన్ని కూడా కమిషన్ టేకప్ చేసే అవకాశమున్నది.

పొలిటికల్ లీడర్లకూ నోటీసులు!

టెక్నికల్ అంశాలపై ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఇంజినీర్లతోపాటు రిటైర్డ్ అధికారులు క్రాస్ ఎగ్జామినేషన్‌లో వెల్లడించిన అంశాల ఆధారంగా పొలిటికల్ లీడర్లకు సైతం కమిషన్ నోటీసులు జారీచేసి ఎంక్వయిరీకి పిలిచే అవకాశమున్నది. మూడు బ్యారేజీల డిజైన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లు, రిటైర్డ్ అధికారులు వెల్లడించిన అంశాలకు సంబంధించి విధాన నిర్ణయం తీసుకున్న పెద్దల నుంచి వివరణ కోరే అవకాశమున్నది. దీనికి తోడు ఢిల్లీలోని ఎన్డీఎస్ఏ, పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్, స్టేట్ విజిలెన్స్ కమిషన్ పూర్తిస్థాయి నివేదికల్లోని అంశాలను కూడా కమిషన్ పరిశీలించి వాటికి అనుగుణంగా ఎంక్వయిరీని వేగవంతం చేసే అవకాశాలున్నాయి. వచ్చే నెల 31 వరకు కమిషన్‌కు ప్రభుత్వం గడువును పొడిగించినందున అప్పటివరకు టెక్నికల్, ఆర్థిక అంశాలపై క్రాస్ ఎగ్జామినషన్‌ను పూర్తి చేయాలని కమిషన్ భావిస్తున్నట్లు ఆ ఆఫీస్ వర్గాల సమాచారం.


Similar News