ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పేరిట ఆస్పత్రుల్లో దందా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

వివిధ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లపై వస్తున్న వరుస ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది.

Update: 2024-09-20 03:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లపై వస్తున్న వరుస ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. అవయవాల ట్రాన్స్‌ప్లాంటేషన్ పేరిట దందాలు సాగుతున్నాయని ఇటీవల కొన్ని ఎన్జీవోలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. అవయవ దానంలో తప్పిదాలు జరుగుతున్నాయని, దీనిపై దృష్టి పెట్టాలని ఆయా సంస్థల ప్రతినిధులు కోరారు. దీంతో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై ప్రభుత్వం ఆడిట్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. రెండు మూడు రోజుల్లో జీవో కూడా రిలీజ్ చేయనుంది. పదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ల వివరాలను వైద్యారోగ్యశాఖ కమిటీ సేకరించనున్నది.

ప్రైవేట్, కార్పొరేట్‌తోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ట్రాన్స్‌ప్లాంటేషన్లపై వేర్వేరుగా రిపోర్టు తీసుకోనున్నారు. అంతేగాక జీవన్‌దాన్‌పై కూడా ఎంక్వయిరీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. గడిచిన పదేళ్లుగా జీవన్‌దాన్‌లో ఎంత మంది రిజిస్టర్ అయ్యారు? ఎన్ని అవయవాలు పేషెంట్లకు అందజేశారు? డోనర్స్ ద్వారా వచ్చినవి ఎన్ని? పోర్టల్ ద్వారా నమోదైనోళ్లకు ఆర్డర్‌లోనే అందజేశారా? ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో జరిగిన ట్రాన్స్‌ప్లాంటేషన్ల లెక్కలు జీవన్‌దాన్‌లో ఉన్నాయా? తదితర అంశాలపై ఆడిట్ కమిటీ ఎంక్వైయిరీ చేయనున్నది. ఆ తర్వాత రాష్ట్రంలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ యాక్ట్ కూడా అడాప్ట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

సీరియస్, సీరియల్‌గానే జరిగాయా..?

అవయవాలు కోసం జీవన్‌దాన్‌లో నమోదు చేసుకుంటే, ఏళ్ల తరబడి వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని బాధితులు చెప్తున్నారు. అదే ప్రైవేట్, కార్పొరేట్లను ఆశ్రయిస్తే, వేగంగా ఆపరేషన్లు జరుగుతున్నాయని కొందరు బాధితులు వివరిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అంశంపై స్టడీ చేసి అవాక్కయ్యారు. ఈ ప్రాసెస్‌లో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానిస్తున్న సర్కార్ వెంటనే కమిటీ వేయాలని నిర్ణయించింది. ఈ పదేళ్లలో నిబంధనల ప్రకారమే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరిగాయా? లేదా బ్యాక్ డోర్‌లో నిర్వహించారా? అనేది నిర్ధారించనున్నారు. ఇదిలా ఉండగా, జీవన్‌దాన్ అనే వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో 2013 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,466 బ్రెయిన్ డెత్స్ జరిగితే అందులో 1,424 బ్రెయిన్ డెత్స్‌ను కార్పొరేట్ దవాఖానాలే డిక్లేర్ చేశాయి. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, సకల సౌకర్యాలు ఉన్న నిమ్స్ హాస్పిటల్ మాత్రం కేవలం 32 బ్రెయిన్ డెత్స్‌ను మాత్రమే గుర్తించగలిగింది. అంతేగాక గాంధీలో పదేండ్లలో ఒకే ఒక్క బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయగా, ఉస్మానియాలో 9 బ్రెయిన్ డెత్స్ మాత్రమే డిక్లేర్ చేశారు. అవయవ మార్పిడి ఆపరేషన్లలో ప్రభుత్వ దవాఖాన్లు వెనుకబడటానికి బ్రెయిన్ డెత్స్‌ను గుర్తించడంలో ఓ నిర్లక్ష్యం అయితే, జీవన్‌దాన్‌ నిబంధనల్లో ఉన్న లొసుగులు కూడా మరో కారణంగా డాక్టర్లే చెప్తున్నారు.

లైవ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ల పరిస్థితీ అంతే..?

రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటళ్లలో జరుగుతున్న లైవ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వివరాలకు లెక్కాపత్రం లేకుండా పోయింది. జీవన్‌దాన్ ద్వారా జరుగుతున్న కెడావర్‌‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీల వివరాలను మాత్రమే జనాలకు అందుబాటులో ఉండేలా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. లైవ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ల వివరాలేవీ ఆరోగ్యశాఖ వద్ద లేవని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని నేషనల్ ఆర్గాన్‌ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్‌కు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు వివరాలు ఇస్తాయని, తమ వద్ద ఉండవని జీవన్‌దాన్ అధికారులు చెప్తున్నారు. అన్ని హాస్పిటళ్లలో కలిపి సంవత్సరానికి దాదాపు 1,500 లైవ్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరుగుతుండొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలన్నీ బయటకు తీసి తప్పిదాలపై చర్యలు తీసుకుంటూనే, వ్యవస్థలోనూ నిబంధనలు స్ట్రిక్ట్‌గా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.


Similar News