బిల్లు రాలేదని తరగతి గదులకు తాళం వేసిన కాంట్రాక్టర్.. ఎండలోనే విద్యార్థులకు పాఠాలు..

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ పరిధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్మించిన రెండు అదనపు తరగతి గదుల బిల్ రావడంలేదని కాంట్రాక్టర్ మహేందర్ రెడ్డి బుధవారం ఆ తరగతి గదులకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.

Update: 2023-02-22 11:58 GMT

దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ పరిధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్మించిన రెండు అదనపు తరగతి గదుల బిల్ రావడంలేదని కాంట్రాక్టర్ మహేందర్ రెడ్డి బుధవారం ఆ తరగతి గదులకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వేరే గత్యంతరం లేక భగభగ మండే ఎండలోనే విద్యార్థులు పాఠాలు వినే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 2020 ఫిబ్రవరి 15వ తేదీన కానుకుంట గ్రామం హైస్కూల్ లో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికై రూ. 16 లక్షల 40 వేలతో కాంట్రాక్ట్ తీసుకొని 2022సంవత్సరంలో పూర్తి చేసి ఇచ్చానని, ఈ నిర్మాణం పూర్తయి సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు తన మొత్తం బిల్లులో కేవలం 40 శాతం రూ. 7 లక్షలు మాత్రమే వచ్చాయని అన్నారు.

మిగిలిన బిల్లు కోసం స్థానిక ప్రజాప్రతినిధులను విద్యాశాఖ అధికారులను ఎన్నిసార్లు కోరినా పరిష్కారం చూపలేదని, అందుకుగాను తాను నిర్మించిన రెండు గదులకు తాళం వేశానని తెలిపాడు. కాగా ఎండలో విద్యార్థులు పాఠాలు వినలేక ఇబ్బంది పడుతుండగా, చివరికి పాఠశాల ఉపాధ్యాయులు స్వయంగా వెళ్లి కాంట్రాక్టర్ ను తాళం తీయాలని కోరగా వారి అభ్యర్థన మేరకు కాంట్రాక్టర్ తాళం తీశాడు. కాగా ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని చెబుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.

Tags:    

Similar News