చిచ్చు రాజేసిన ఒక్క పోస్టు.. తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగుల మధ్య మళ్లీ వివాదం

ఆంధ్ర, తెలంగాణ పంచాయితీ మళ్లీ తెరపైకి వచ్చింది. కొట్లాడి, అమరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ఈ వివాదం రాజుకుంది.

Update: 2024-09-09 02:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్ర, తెలంగాణ పంచాయితీ మళ్లీ తెరపైకి వచ్చింది. కొట్లాడి, అమరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ఈ వివాదం రాజుకుంది. ఒక్క పోస్టు.. తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగుల నడుమ చిచ్చు రాజేసింది. విద్యుత్ విభాగంలో అత్యంత కీలకమైన తెలంగాణ విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి(సీఈఐజీ) పోస్టు ఆగస్టు 31తో ఖాళీ అయింది. ఆ పోస్టులో ఉన్న అధికారి ఉద్యోగ విరమణ తర్వాత కొత్త వారి నియామకం.. శాఖలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తెలంగాణ వారికే ఇవ్వాలని స్థానిక ఆఫీసర్లు పట్టుపడుతుండగా ఏపీ అధికారికే ఇవ్వాలని ఆంధ్ర అధికారులు పట్టుపడుతున్నారు. దీంతో ఇరు వర్గాల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. ఆంధ్రులకే ఇవ్వాలని రిటైర్ అయిన పలువురు పట్టు పడుతున్నారు. వారు సర్కారుకు సిఫారసు సైతం చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా గతంలో ఉన్న ఆఫీసర్లు చేసిన అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకేనా? అనే చర్చ విద్యుత్ శాఖలో జరుగుతోంది.

తెలంగాణ ఆవిర్భావం నుంచి సీఈఐజీ పోస్టులో ఆంధ్ర ఆఫీసర్లే

విద్యుత్ శాఖలో ప్రధాన పోస్టుల్లో పలువురు ఆంధ్ర ఆఫీసర్లను ఇటీవల నియమించారు. దీనిని ఉద్యోగులతో పాటు యావత్ తెలంగాణ సమాజం తప్పుపడుతోంది. స్వరాష్ట్రంలో ఇంకా ఆంధ్రుల పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి సీఈఐజీ పోస్టులో ఆంధ్ర అధికారులే కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఖాళీ అయిన సీఈఐజీ స్థానంలో ఆంధ్ర అధికారినే నియమించాలని ఏపీకి చెందిన రిటైర్ అయిన పలువురు సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇది శాఖలో చర్చనీయాంశంగా మారింది. గత ఆఫీసర్లు చేసిన అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకే.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారినే నియమించాలని వారు పట్టుపడుతున్నట్టు సమాచారం.

సీఈఐజీ ఎంపికపై తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు!

విద్యుత్ శాఖలో సీఈఐజీ పోస్టు ఎంతో కీలకం. 10 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యానికి మించిన వినియోగానికి సీఈఐజీ అప్రూవల్ తప్పనిసరి. వాటికి సంబంధించిన అప్లికేషన్, డాక్యుమెంట్ సబ్మిషన్ నుంచి మొదలు, ఇన్‌స్పెక్షన్ వరకు ప్రతి ఇష్యూనూ క్రాస్ చెక్ చేసిన తర్వాతే సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. అంత కీలకమైన పోస్టు కావడంతో కొత్తగా ఎవరిని నియమిస్తారనే విషయంపై శాఖలో సర్వత్రా ఎదురుచూస్తున్నారు. ఈ పోస్టు కోసం తెలంగాణ, ఆంధ్ర అధికారుల మధ్య పోటీ నెలకొంది. ఆంద్ర అధికారిని నియమిస్తే తెలంగాణ ఉద్యోగుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదముంది. ఏపీకి చెందిన ఓ వ్యక్తిని నియమించాలని ఇంతకాలం సీఈఐజీలుగా పనిచేసిన వారు ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. గతంలో వారు చేసిన అవకతవకలు బయటపడే అవకాశముందని భావించి తెలంగాణకు చెందిన వారిని సీఈఐజీ సీటులోకి రాకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక సర్కారు, ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారు ఎవరి వైపు మొగ్గుచూపుతారన్నది సస్పెన్స్‌గా మారింది. ఆంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పంచాయితీకి ఉత్కంఠ ఎన్నడు వీడుతుందో చూడాలి.


Similar News