‘స్థానికం’ పై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌.. కీలక నేతలు వెళ్లిన చోట ఇతరులకు బాధ్యతలు

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది.

Update: 2024-09-01 02:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయాలని భావిస్తోంది. త్వరలోనే పార్టీ నేతలతో అధినేత కేసీఆర్ భేటీకి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన చోట ప్రత్యామ్నాయంపై దృష్టి సారిస్తోంది.

గ్రామస్థాయి నుంచి కేడర్‌కు షెడ్యూల్!

రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు 9 నెలల్లోనే ఫెయిల్ అయిందని, ప్రజావ్యతిరేకత ప్రారంభమైందని భావిస్తూ, దానిని అనుగుణంగా మల్చుకొని మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఎక్కడ ప్రజలు ఆందోళన బాటపట్టినా.. ప్రభుత్వ పథకాలు అందడం లేదని నిరసనలు చేపట్టినా బీఆర్ఎస్ మద్దతుగా నిలువనుంది. పార్టీ చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలోనూ కేడర్‌ను భాగస్వాములను చేయనుంది. గ్రామస్థాయి నుంచి కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసేలా షెడ్యూల్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ప్రతి ఇంటికీ వెళ్లి బీఆర్ఎస్ పథకాలను వివరించడంతో పాటు కాంగ్రెస్ విస్మరించిన ఆరు గ్యారంటీలతో పాటు హామీల అమలులో వైఫల్యం చెందిందని చెప్పబోతున్నట్టు పార్టీ లీడర్లు తెలిపారు.

కేడర్‌ను యాక్టివ్ చేయాలని ప్లాన్

పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై త్వరలోనే పార్టీ సీనియర్లతో కేసీఆర్ భేటీ కానున్నట్టు సమాచారం. ఈ భేటీకి వేదిక ఫాం హౌస్‌నా? లేకుంటే భవన్‌నా? అనేది పార్టీ క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలిసింది. పది అసెంబ్లీ సెగ్మెంట్లకు పైగా లీడర్లతో ఇప్పటికే ఫాం హౌస్ వేదికగా భేటీ అయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, ప్రజల్లో పార్టీకున్న ఆదరాభిమానాలు, బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. ఆ తర్వాత భేటీపై క్లారిటీ ఇస్తామని, నియోజకవర్గాలవారీగా తేదీలు ఇస్తామని చెప్పి నెలన్నరకు పైగా సమయం గడిచినా ఆ ఊసేఎత్తలేదు. పార్టీ కేడర్‌కు దూరంగా ఉన్నారు. వరుస ఓటములతో నైరాశ్యంలో కేడర్ ఉండటంతో.. స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలను పార్టీ అధిష్టానం చేస్తోంది. లీడర్ల అభిప్రాయం తెలుసుకుని క్షేత్రస్థాయిలో కేడర్‌ను యాక్టివ్ చేయాలని భావిస్తోంది.

ఆ సెగ్మెంట్లలో ఇన్‌చార్జీల నియామకం!

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్‌లో చేరారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ కేడర్ చేజారకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పార్టీ లీడర్ల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే ఇన్‌చార్జీలను నియమించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. బలమైన నేతను అందరి అభిప్రాయం మేరకు నియమించాలని, అందుకోసం కసరత్తును ప్రారంభించినట్టు సమాచారం. త్వరలోనే పార్టీ ఇన్‌చార్జీలను నియమించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు

పార్టీలో కీలకంగా పనిచేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నియోజకవర్గాల్లో అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం కీలకంగా పనిచేశారు. వారి నియోజకవర్గాల్లో కీలకనేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం. పార్టీని బలోపేతం చేయాలని, ఇక్కడ రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న నేతలకే ఇన్‌చార్జిగా నియమించాలని భావిస్తోంది. అందుకోసం బలమైన లీడర్ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే వారి పేర్లను అధిష్టానం అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిసింది.


Similar News