టీబీజేపీలో కేసీఆర్ కోవర్టులు.. అంతర్గత విషయాలు లీక్?
బీజేపీలో దీర్ఘకాలంగా ఉంటూ తెలంగాణలో పార్టీకి నష్టం కలిగించే విధంగా రెండు రోజుల క్రితం ఓ సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ బీజేపీలో సీఎం కేసీఆర్‌కు కోవర్టులున్నారా? బీఆర్ఎస్ నేతలకు పార్టీ అంతర్గత విషయాలు ఎప్పటికప్పుడూ చేరి పోతున్నాయా? కొందరు నేతలు ఉద్దేశ పూర్వకంగానే సొంత పార్టీని బద్నాం చేస్తున్నారా? మొదటి నుంచీ ఓ సామాజిక వర్గంపై ఉన్న అనుమానం నిజం అవుతున్నదా ?..ఇవే ఇప్పుడు కమలం పార్టీ జాతీయ అగ్రనేతల్లో జరుగుతున్న చర్చలు. కర్ణాటకలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట బీజేపీ వ్యూహం లీక్ కావడం, ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్‌కు దగ్గర చేయడం మొదలు, తాజాగా తెలంగాణ స్టేట్ యూనిట్‌లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పలువురు లోపాయికారిగా జట్టు కట్టడం వరకు జరిగిన పరిణామాలపై బీజేపీ హై కమాండ్ సీరియస్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో దీర్ఘకాలంగా ఉంటూ తెలంగాణలో పార్టీకి నష్టం కలిగించే విధంగా రెండు రోజుల క్రితం ఓ సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ విధానానికి భిన్నంగా వ్యవహరించిన ఓ నేతను మాతృసంస్థకు పంపిన హైకమాండ్..ఇప్పుడు తెలంగాణ స్టేట్ యూనిట్‌కు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నది. పార్టీలో ఉంటూనే ప్రత్యర్థి పార్టీలకు బలం చేకూరేలా కామెంట్లు చేయడాన్ని క్రమశిక్షణారాహిత్యంగానే పరిగణిస్తున్నది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తగిన సహకారం అందించడానికి బదులుగా చేతులెత్తేసేలా వ్యవహరించడం, ప్రత్యర్థి పార్టీలకు ఉపయోగపడేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నది.
కొందరు లీడర్లపై అనుమానాలు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీపై ప్రతికూల ప్రభావం చూపేలా చిట్‌చాట్ పేరుతో నేతలు అభిప్రాయాలు వెల్లడించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రాష్ట్రంలో కొద్దిమంది లీడర్లపై హైకమాండ్‌కు అనుమానాలున్నాయి. అందుకే వారికి పార్టీలో ప్రాధాన్యత కలిగిన బాధ్యతలు అప్పగించలేదు. హిందుత్వ నినాదం గురించి ప్రస్తావించడమే కాక, తెలంగాణలో ఇది వర్కవుట్ అయ్యే ఫార్ములా కాదని, స్టేట్ యూనిట్ చీఫ్ బండి సంజయ్ తనకు తానుగా హిందువుల నాయకుడని చెప్పుకుంటూ దీన్నే పదే పదే ఫోకస్ చేయడంతో పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని చేసిన కామెంట్‌ను నేషనల్ కమిటీ లీడర్లు సీరియస్‌గా తీసుకున్నారు.
పార్టీ లైన్‌కు భిన్నంగా..
ఇటీవల తెలంగాణకు చెందిన జాతీయ నేత మీడియా ప్రతినిధులతో పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఢిల్లీ కేంద్ర కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాని పక్షంలో బీఆర్‌ఎస్ వచ్చినా ఫర్వాలేదు..రావాలి..” అని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లుగా ఆ నేత చెప్పడాన్ని హైకమాండ్ తప్పుబట్టినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి తోడు ‘మోడీ, అమిత్ షా, నడ్డా కలిసి కేసీఆర్‌ను ఎంతగా తిడితే బీఆర్‌ఎస్‌కే ఆ మేరకు ఓటు శాతం పెరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య వ్యతిరేక ఓటు చీలిపోయి బీఆర్‌ఎస్ గెలుస్తుంది. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ వాతావరణంలో బీజేపీకి మూడో స్థానమే..’ అంటూ కామెంట్లు చేయడం కేంద్ర నాయకత్వం సహించేలా లేదని పేర్కొన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పార్టీని బలోపేతం చేయడానికి బదులుగా మరింత బలహీనపరిచేలా వ్యవహరిస్తున్న నేతల తీరు హైకమాండ్‌కు రుచించలేదు. స్టేట్ యూనిట్‌ను మార్చాలని, హిందుత్వ నినాదానికి తోడు మరికొన్ని అంశాలను ఎంచుకోవాలనే పలు ప్రతిపాదనలతో ఇటీవల కొద్దిమంది స్టేట్ లీడర్లు ఢిల్లీ పెద్దలతో చర్చించడానికి వచ్చినప్పుడే అసహనం మొదలైందని, దీనికి తాజాగా సీనియర్ నేత చిట్‌చాట్ పేరుతో మాట్లాడిన మాటలు ఆజ్యం పోసినట్లయిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర జరిగినంత కాలం పార్టీ శ్రేణుల్లో కనిపించిన ఉత్సాహం కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తగ్గిపోడాన్ని హైకమాండ్ గమనంలోకి తీసుకున్నది.
నెగెటివ్ కామెంట్లపై హై కమాండ్ సీరియస్
బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్న సమయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీలో ఇటీవల చేసిన వ్యాఖ్యలు అగ్రనేతలకు ఆగ్రహం కలిగించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత అరెస్టు ఎపిసోడ్‌ను బీజేపీకి ముడిపెట్టడం సమంజసం కాదని తెలిసినా, దానిపై మీడియాతో మాట్లాడడం నెగెటివ్ కలిగించిందనే అభిప్రాయం ఆ పార్టీ నేషనల్ లీడర్లలో వ్యక్తమైంది. కవితను అరెస్టు చేయకపోతే బీజేపీని ప్రజలు నమ్మరని, బీఆర్ఎస్‌తో కుమ్మక్కైంది నిజమే అనే అనుమానాన్ని రూఢీ చేసినట్లవుతుందనే కామెంట్లను కూడా అంతే సీరియస్‌గా తీసుకున్నది. పార్టీలో బాధ్యత కలిగిన స్థాయిలో ఉండి ప్రయోజనం కలిగించేలా వ్యవహరించడానికి బదులు నష్టం జరిగేలా ప్రవర్తించడాన్ని చక్కదిద్దకపోతే ప్రమాదం తప్పదని గ్రహించింది.
నిజమేననే అభిప్రాయం
బీజేపీలో బీఆర్ఎస్‌కు కోవర్టులు ఉన్నారంటూ చాలాకాలంగా జరుగుతున్న చర్చలు, వస్తున్న వార్తలు తాజా పరిణామాలతో నిజమేననే అభిప్రాయానికి తావిచ్చినట్లయింది. పార్టీలో తగిన పదవులు రావడం లేదనే అక్కసుతో, వ్యక్తుల మీద ఉన్న భిన్నాభిప్రాయంతో మొత్తం సంస్థకే నష్టం కలిగించేలా వ్యవహరించడం క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తున్నది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇలాంటి వారిపై చర్యలు ఇప్పుడే తీసుకుంటుందా? లేక అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాతనా అనేది ప్రస్తుతం సమాధానం లేని ప్రశ్నగానే ఉండిపోయింది. చివరకు ఒక సామాజిక వర్గం మొత్తం కేసీఆర్‌కు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారనే సాధారణ అభిప్రాయం కలగడానికి దారితీసినట్లయింది.