చేప మందు కోసం వెళ్తున్నారా? మీకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త!
మృగశిరకార్తె ప్రారంభం కానున్నదున ఈ నెల 8నుంచి హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: మృగశిరకార్తె ప్రారంభం కానున్నదున ఈ నెల 8నుంచి హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ చేపమందు ప్రసాదం అందించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆస్తమాతో సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప మందు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి సంవత్సరం బత్తిని ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేప ప్రసాదానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ క్రమంలోనే చేప మందుకు వచ్చే వారి కోసం టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
జూన్ 8, 9వ తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ చేయనున్నారు. తేదీల్లో 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. వీటితో పాటు దిల్సుఖ్నగర్, ఎన్జీవోస్ కాలనీ, మిథాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రాంనగర్, రాజేంద్రనగర్, రిసాల్ బజార్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, పటాన్చెరు, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ కాలనీ, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మొత్తం 80 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ప్రయాణికులకు దగ్గరలోని బస్‌స్టాండులో కనుక్కోవాలని సూచించింది.