డ్రగ్స్ వ్యాపారులకు ఉచ్చు బిగించేందుకు టీజీ న్యాబ్ 7 డేస్ డ్యూటీస్ ప్లాన్

రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా, విక్రయాలు, నిల్వలు, వినియోగాన్ని అణిచివేసేందుకు టీజీ న్యాబ్ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది.

Update: 2024-07-14 16:07 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా, విక్రయాలు, నిల్వలు, వినియోగాన్ని అణిచివేసేందుకు టీజీ న్యాబ్ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, తో పాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల దందాను నివారించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన 35 నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ ను రంగంలోకి దింపుతున్నారు. ఈ టీమ్స్ తో పాటు పోలీసు శాఖలోని వివిధ ప్రత్యేక బృందాలతో వీటి అడ్డాలను జల్లెడ పడుతున్నారు. దీని కోసం 7 డేస్ డ్యూటీస్ ను రూపొందించారు. ఈ 7 డేస్ డ్యూటీస్ అందరూ విభజించుకుని పని చేస్తే డ్రగ్స్ ను అరికట్టడం చాలా ఈజీ అని అధికారులు జరిపిన అధ్యయనంలో స్పష్టమైంది. దీని కోసం టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పెషల్ ఫోకస్ పెట్టి ఎన్ డి డి(నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ ) టీంల పని తీరును పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంలో భాగంగా వివిధ యాక్షన్ ప్లాన్ లో ఈ ఎన్ డి డి టీమ్స్ 7 డేస్ డ్యూటీస్ ప్రజల్లో భరోసా, డ్రగ్స్ అక్రమ వ్యాపారుల్లో భయం స్రుష్టిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎన్‌డిడి 7 డేస్ డ్యూటీ ఇలా..

*ప్రతి స్కూల్, కాలేజీలు, కళశాలలు, కోచింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిసరాల ప్రాంతాల్లో పాన్ షాపులను లేకుండా చూడాలి. అదే వీటి సమీపంలో ఉండే పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, రోడ్ల పై పెట్టే తినుబండారాల వ్యాపార కేంద్రాలను ఈ ఎన్ డి డి డాగ్స్ తో తనిఖీ చేయాలి. ఓసీబీ పేపర్, గంజాయి, ఇంజక్షన్ తో డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇంకా ఏమైనా అనుమానాస్పద చాక్లెట్ లు, మిఠాయిలు విక్రయిస్తున్నారా అనే కోణంలో దృష్టి పెట్టాలి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఈ 35 డాగ్ స్క్వాడ్స్ టీం‌లు దాదాపు 150 విద్య సంస్థల పరిసరాలను తనిఖీ చేయాలి.

*ప్రధాన కూడళ్లతో పాటు రైల్వే స్టేషన్‌లలో సోదాలు జరపాలి. మత్తు పదార్థాలు, డ్రగ్స్ , గంజాయి అధికంగా వచ్చే రాష్ట్రాల నుంచి లేదా వయా రూట్ లో వచ్చే రైలు సమయాన్ని గుర్తించి తనిఖీలు జరపాలి.

*కొరియర్, ట్రాన్స్పోర్ట్ సంస్థల గోడౌన్ ల వద్ద సెర్చింగ్ చేపట్టాలి. చిన్న పెద్ద లేకుండా అన్ని సంస్థల కొరియర్, ట్రాన్స్ పోర్ట్ సంస్థల గోదాముల ప్రాంగణాల్లో ఈ డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా చెకింగ్‌లు చేయాలి.

*విజయవాడ, బెంగళూరు, పూణే, రాజస్థాన్, ముంబాయి, గోవా ఇంకా తదితర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను శివారు ప్రాంతాల్లో ఆపి ఎన్ డి డి టీమ్స్ చెకింగ్స్ ను చేపట్టాలి. వాటిల్లో ఉండే లగేజీలను సైతం తనిఖీ చేయాలి.

*రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి నాలుగు క్రాసింగ్ పాయింట్‌లు ఉన్న గోదావరి నది దగ్గర తో పాటు టోల్ ప్లాజాల వద్ద తనిఖీలు నిర్వహించాలి.

*అకస్మాత్తుగా బార్‌లు, డిస్కో‌టెక్‌లు, పబ్ లు , ఇంకా పలు మద్యం విక్రయించే రెస్టారెంట్ ల వద్ద తనిఖీ చేయాలి. ఎన్ డి డి ద్వారా సోదాలు జరపాలి. అదే విధంగా ఇక్కడ 21 సంవత్సరాల వయస్సు తక్కువ ఉన్న వారికి మద్యం విక్రయిస్తే వాటిపై కూడా కేసులు నమోదు చేయాలి. తనిఖీల్లో భాగంగా అక్కడ మద్యం సేవించే వారి వయస్సు మీద అనుమానం ఉంటే వారి ఆధార్ కార్డుతో వయస్సును నిర్ధారించుకోవాలి. 21 సంవత్సరాల వయస్సు తక్కువ ఉన్న వారికి మద్యాన్ని విక్రయించినట్లు తేలితే మేనేజర్ ల మీద కాకుండా యజమానుల మీద కేసులు నమోదు చేయాలి. ఈ కేసుల్లో 7 సంవత్సరాల శిక్ష ఖరారయ్యే విధంగా అభియోగాలను నమోదు చేయాలి.

*సుడాన్, నైజీరియా, కెన్యా తదితర డ్రగ్స్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే విదేశియులు నివాసం ఉండే కాలనీలు, బస్తీలు, హోటల్స్ లలో ఎన్ డిడి టీమ్స్ తనిఖీల చేపట్టాలి. వారి పత్రాలను కూడా పరిశీలించాలి. ఈ దేశాల నుంచి వచ్చే విదేశియుల సమాచారం ఎఫ్ఆర్ఆర్ఓ నుండి తీసుకుని వీరు నివాసం ఉంటున్న ప్రాంతాలను జల్లెడ పట్టాలి. వారు చదువుకోవడానికి వస్తే ఏ కళాశాలలో చదువుతున్నారు. ఇప్పటి వరకు వారు ఎన్ని తరగతులు హాజరయ్యారు, వారి కళాశాల అధికారులు సిబ్బందితో పోలీసులు మాట్లాడాలి. వారి పై ఏమైనా పాత కేసులు ఉన్నాయా అనే విషయాన్ని ఆరా తీయాలి. వ్యాపారానికి వస్తే వాటి వివరాలు వారు జరిపిన లావాదేవీలు, వారి ఫోన్ నెంబర్ల వివరాలు ఇంకా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి నిర్ధారించుకోవాలి. అనుమానం వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ఇలా ఈ 7 డేస్ డ్యూటీ ఒకే పంధాలో కాకుండా అక్రమ వ్యాపారులు పసిగట్టకుండా వారి ఆలోచనకు అంతు చిక్కకుండా ఈ తనిఖీలను జరపాలని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రత్యేక ప్లాన్ ను రూపొందించారు. ఈ ప్లాన్ ను అమలు చేయడం వల్ల అందరికీ కనపడే విధంగా తనిఖీలు , సోదాలు జరుగుతుంటే ప్రజల్లో భరోసా నింపడంతో పాటు అక్రమ మత్తు వ్యాపారులకు చెక్ పెట్టొచ్చని ఆయన స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా ప్రజల నుంచి కూడా డ్రగ్స్ దందా పట్ల పోలీసులకు కీలక సమాచారం అందే అవకాశం కూడా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ 7 డేస్ డ్యూటీస్ కు సంబంధించిన అన్ని జిల్లాల అధికారులకు టీజీ న్యాబ్ డైరెక్టర్ సమాచారం అందించారు.

Tags:    

Similar News