TG Govt.: రోడ్డు ప్రమాదాలపై సర్కార్ ఫోకస్.. డిజైన్ లోపాలపై ఆర్‌అండ్‌బీ కసరత్తు

రోడ్లను ప్రమాద రహిత ప్రదేశాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నది.

Update: 2024-08-31 01:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రోడ్లను ప్రమాద రహిత ప్రదేశాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నది. రవాణా, పోలీసు శాఖ ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టే అంశాలను పక్కనపెడితే.. యాక్సిడెంట్ జరగకుండా రోడ్డును ఎలా డిజైన్ చేయాలనే దానిపై సర్కారు లోతుగా దృష్టి సారించింది. రాష్ట్ర రహదారులపై ఏర్పడిన బ్లాక్‌స్పాట్ల తొలగింపునకు రోడ్లు, భవనాల శాఖ చర్యలు చేపడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రోడ్లపై 658 బ్లాక్‌స్పాట్స్ ఉండగా, 297 బ్లాక్‌స్పాట్లను గత రెండేండ్లలో తొలగించినట్టు తెలిసింది. మిగతా 361 బ్లాక్‌స్పాట్లను పూర్తిగా రిపేర్‌ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో బ్లాక్‌స్పాట్‌ను గుర్తించి, తొలగించేందుకు ఆర్‌ అండ్‌ బీ, రవాణా, వైద్య ఆరోగ్యం, పోలీసు, విద్యా శాఖలన్నీ కలిసి సమన్వయంగా చర్యలు చేపడుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు మిగతా బ్లాక్‌స్పాట్లను కూడా వేగంగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.

తొలగించాల్సిన బ్లాక్ స్పాట్స్ 123

2023లో రాష్ట్రంలో 22,903 ప్రమాదాలు జరిగాయని, వాటిలో 7,186 ప్రాణాంతక ప్రమాదాలు, 2,476 తీవ్ర గాయాలు, 10,404 చిన్న గాయాలు, 2,747 సాధారణ గాయాలు అయ్యాయని ఆఫీసర్లు నివేదిక సిద్ధం చేశారు. ప్రతి జిల్లాలో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించామని, అక్కడ ప్రమాదాలు జరగకుండా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడిస్తున్నారు. ఆర్‌ అండ్‌ బీ పరిధిలో మొత్తం 27,461 కిలోమీటర్ల రహదారులున్నాయి. అందులో రాష్ట్ర రహదారులు మొత్తం 1,727 కిలోమీటర్లు, జిల్లా ప్రధాన రహదారులు 11,371 కిలోమీటర్లు, ఇతర జిల్లా రోడ్లు 14, 363 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ రహదారుల్లోనూ రెండు రకాల రోడ్లు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా రాష్ట్ర రహదారుల కోటా(అండర్‌ స్టేట్‌ కోటా)లో ఉన్నవాటిపై 256 బ్లాక్‌స్పాట్లు గుర్తించగా, 133 బ్లాక్‌స్పాటను తొలగించారు. ఇంకా 123 తొలగించాల్సి ఉంది. మరోరకమైన పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం(అండర్‌ పీపీపీ కోటా)లోని రోడ్లపై 207 బ్లాక్‌స్పాట్లను గుర్తించగా, 164కు మరమ్మతులు చేశారు. ఇంకో 43 బ్లాక్‌స్పాట్లను తొలగించాల్సి ఉంది.

రోడ్డు భద్రతకు భారీ బడ్జెట్

రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు భారీ స్థాయిలో ఖర్చు చేయనుంది. ఐదేండ్ల పాటు చేపట్టే రోడ్డు భద్రతా చర్యలకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రహదారులకు సుమారు రూ.7,700 ఖర్చు చేయాలని యోచన చేస్తున్నది. ఈ నిధుల్లో 50 % కేంద్ర రోడ్డు రవాణా శాఖ భరిస్తుందని అధికారులు చెబుతున్నారు. 25 % ప్రపంచ బ్యాంకు, మరొక 25 % ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఏడీబీ)ల నుంచి రుణంగా పొందనున్నట్టు తెలిసింది. ఈ నిధులను దేశంలో అత్యధికంగా ప్రమాదాలు జరిగే 12 రాష్ట్రాలకు మాత్రమే ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఉభయ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా ఏటా రూ. 60 కోట్లు రాష్ట్ర రోడ్లపై జరిగే ప్రమాదాల నివారణకు చేపట్టే చర్యలకు ఖర్చు చేయనుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్లలో రూ.360 కోట్లు భరించనుంది. ఈ మార్గదర్శకాల్లో భాగంగా రాష్ట్రంలో ఐదు వివిధ శాఖలు కలసి సమన్వయంగా పని చేయనున్నాయి. రోడ్లు, భవనాలు, పోలీసు, వైద్య శాఖ, ట్రాన్స్‌పోర్టు, విద్యాశాఖలు తమ పరిధిలోని అంశాలపై చర్యలు చేపట్టి నోడల్‌ ఏజెన్సీగా ఉండే రహదారుల భద్రత అధికారికి నివేదించనున్నారు. ఈ అంశంపై మార్గదర్శకాల రూపకల్పన కసరత్తు చివరి దశకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

రహదారుల భద్రతకు చర్యలేంటీ?

సాధారణంగా నేషనల్‌ హైవే(ఎన్‌హెచ్)లపై ఒకే ప్రదేశంలో ప్రమాదాలు తరచూ జరిగినప్పుడు ఆ ప్రాంతాన్ని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా బ్లాక్‌ స్పాట్‌గా గుర్తిస్తుంది. దానివద్ద ఇంజినీరింగ్‌ డిజైనింగ్‌ వర్కులను మళ్లీ పరిశీలిస్తుంది. అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత విభాగ ఆఫీసర్లు పని చేస్తారు. వారు నివేదించిన మేరకు చర్యలు చేపడుతారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పైన పేర్కొన్న ఐదు శాఖల్లో ఒక్కో శాఖ నుంచి ఒక కీలక అధికారి దీనికి బాధ్యులుగా ఉంటారు. ఏ ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయో గుర్తించి చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర రోడ్లపై జరిగే ప్రమాదాలను బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించేందుకు పోలీసుల శాఖ ఇచ్చే సమాచారాన్ని కీలకంగా తీసుకుంటారు. ప్రమాదాల జరుగుతున్న తీరు, మృతులు, క్షతగాత్రులు గాయపడిన తీరు వైద్య శాఖ ద్వారా తెలుసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సమాలోచనలు చేస్తారు. రవాణా శాఖ ద్వారా ఆ ప్రాంతంలో వెళుతున్న వాహనాల సరళి, వాటి లోడుకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా డేటా తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు. విద్యా శాఖ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చడం.. అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి ఈ మేరకు చర్యలు తీసుకుంటారు.

బ్లాక్‌ స్పాట్స్ తొలగింపునకు తీసుకునే చర్యలేంటీ?

బ్లాక్‌స్పాట్ల తొలగింపు అనేది ఒక నిరంతర ప్రక్రియని రోడ్లు, భవనాల విభాగం ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒక ప్రదేశంలో ఇతర నాలుగు శాఖల అధికారులతో సమన్వయంగా పని చేస్తుంది. బ్లాక్‌స్పాట్ల గుర్తించిన తర్వాత రోడ్డు డిజైన్‌ చేసే క్రమంలో ఏమైనా ఇంజినీరింగ్‌ ప్లానింగ్‌ ఇబ్బందులున్నాయా? అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. ఒకవేళ అది ఏమైనా ఉంటే, దాన్ని పరిష్కరిస్తారు. బ్లాక్‌స్పాట్‌ సమీప ప్రాంతాల్లో వాహనదారులను హెచ్చరిస్తూ ట్రాన్స్‌పోర్టు శాఖ ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు అవసరమైన చోట గ్రేడ్‌ సెపరేటర్స్‌ నిర్మాణం, రోడ్లు వెడల్పు చేయడం లాంటి పనులు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే, ఇంజినీరింగ్ సంబంధింత అంశాల్లో రోడ్లు మరింత మెరుగు అవుతాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


Similar News