TG Govt.: ‘హెల్త్’ వర్సెస్ ఆర్ అండ్ బీ! సెక్రెటేరియట్‌లో హాట్ టాపిక్‌గా ఫైట్
వైద్యారోగ్య, ఆర్అండ్ బీ శాఖల మధ్య మెడికల్ కాలేజీ నిర్మాణాల అంశం చిచ్చు పెట్టింది.
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్య, ఆర్అండ్ బీ శాఖల మధ్య మెడికల్ కాలేజీ నిర్మాణాల అంశం చిచ్చు పెట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఆర్ అండ్ బీ శాఖకు మెడికల్ కాలేజీల నిర్మాణాల కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే, ఆ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ నిబంధనలకు అనుగుణంగా, మెడికల్ కాలేజీల అవసరాల నిమిత్తం లేవని, ఇష్టారీతిన కట్టారని వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకున్న కాంగ్రెస్ సర్కార్, మెడికల్ కాలేజీ నిర్మాణాల కాంట్రాక్ట్ ను ఆర్ అండ్ బీకి ఇవ్వొద్దని నిర్ణయించింది. తాజాగా కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణాలను వైద్యారోగ్యశాఖలోని టీజీఎంఎస్ ఐడీసీ (తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌కు) అప్పగించింది. అంతేగాక ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లోని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను కూడా కో –ఆర్డినేట్ చేయాలని సూచించింది. రెండు కార్పొరేషన్లు సమన్వయంతో సక్సెస్ పుల్ గా మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రభుత్వం సూచించింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, లోపాలు లేకుండా నిర్మించాలని పేర్కొన్నది. దీంతో ఆర్ అండ్ బీ శాఖ అసంతృప్తి చెందినట్లు సమాచారం. తమ పనితీరును వైద్యారోగ్యశాఖ కావాలనే తప్పుపట్టిందంటూ ఆర్ అండ్ బీకి చెందిన కొందరు ఇంజినీర్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. తమ శాఖ వర్క్ ను చిన్నగా చూపే ప్రయత్నం సరికాదని వివరించినట్లు తెలిసింది. ఇది సెక్రెటేరియట్ లోని హైయ్యర్ ఆఫీసర్ల మధ్య బిగ్ డిస్కషన్ గా మారడం గమనార్హం.
మెడికల్ కార్పొరేషనే కరెక్ట్!
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలి విడతలో వచ్చిన మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట్, సిద్దిపేట మెడికల్ కాలేజీలను మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిర్మించింది. వైద్యారోగ్యశాఖలో భాగమైన కార్పొరేషన్ కావడంతో నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ను పాటిస్తూ మెడికల్ అకాడమిక్ కు అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలతో విజయవంతంగా నిర్మించారు. విద్యార్థులకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండేలా ఆయా కాలేజీల్లో వసతులతోపాటు ల్యాబ్స్ తదితరవి మెడికల్ నామ్స్ ప్రకారం తీర్చిదిద్దారు. ఆయా కాలేజీల నిర్మాణాల పట్ల వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, హెచ్ వోడీలు కూడా గతంలో సంతృప్తిని వ్యక్తం చేశారు.
కానీ, ఆ తర్వాత రెండో విడతలో వచ్చిన మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి, మూడో విడుతలో రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగామ మెడికల్ కాలేజీల నిర్మాణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ అండ్ బీకి ఇచ్చింది. అందులో మెజార్టీ కాలేజీలు సరైన నిర్మాణంలో లేవని గతంలో అధికారులే తప్పుపట్టారు. గత ప్రభుత్వానికి వివరించినా స్పందించలేదు. దీంతో కాంగ్రెస్ సర్కార్ పవర్ లోకి వచ్చిన తర్వాత మరోసారి వివరించగా, వైద్యశాఖకు పాజిటివ్ గా నిర్ణయం తీసుకున్నది. ‘మీకు మెడికల్ కాలేజీలు కట్టిన అనుభవం ఉన్నదా?’ అంటూ స్వయంగా హెల్త్ సెక్రటరీ... ఇటీవల ఆర్ అండ్ బీ అధికారులను ప్రశ్నించారంటే పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీంతో నాలుగో విడత ఏర్పాటు చేయబోతున్న జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ జిల్లా లోని కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీల నిర్మాణాల బాధ్యతలను టీజీఎంఎస్ ఐడీసీకి అప్పగించారు. ఈ కాలేజీలన్నింటికి ప్రభుత్వం రూ. 1,479 కోట్లు మంజూరు చేసింది.