BRSకు ఎమ్మెల్సీల టెన్షన్.. 29 మందిలో మిగిలేదెవరు..?

బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టడంతో బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకున్నది.

Update: 2024-06-20 01:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/వరంగల్ బ్యూరో : బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టడంతో బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకున్నది. నిధులు, పదవుల కోసం వారు పార్టీ మారితే పరిస్థితి ఏంటనే ఆందోళన చెందుతున్నారు. శాసనమండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా అందులో 29 మంది బీఆర్ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్‌కు నలుగురు, బీజేపీ ఒక్కరు, ఎంఐఎం ఇద్దరు, ఇండిపెండెంట్లు (ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు) ఇద్దరు ఉండగా.. గవర్నర్ కోటా కింద మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఎలాగైనా గులాబీ పార్టీ బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ చేపట్టింది. ఇప్పటికే కొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. చేరేందుకు సైతం కొందరు సిద్ధమైనట్టు టాక్. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం.. ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉన్నదని ఆరా తీస్తున్నది. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారిని నుంచి వివరాలు సేకరిస్తున్నది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే మండలిలో కచ్చితంగా బలం ఉండాలని భావిస్తున్న గులాబీ పార్టీ.. తమ ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

బలం పెంచుకునేందుకు..

త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో కొన్ని నిర్ణయాలు, బిల్లులు పాస్ చేసేందుకు సిద్ధమవుతున్నది. బిల్లులు ఆమోదం పొందాలంటే మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపాలి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు శాసనసభలో తిరుగులేని బలం ఉన్నా.. మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. దీంతో పలు కీలక బిల్లుల ఆమోదం, ఇతర అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వీరు అడ్డంకిగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు టాక్.

పదవులతో ఎర?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరితే పదవులు, నిధులు ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ ఇచ్చినప్పటికీ మరో కొంతకాలం పదవి ఉండాలంటే పార్టీ మారడం శ్రేయస్కరమని కొందరు ఎమ్మెల్సీలు భావిస్తున్నట్టు టాక్. అందులో భాగంగానే కాంగ్రెస్‌లో చేరేందుకు పలువురు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కొందరితో పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్‌లో సంప్రదిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదని, అలాగని పార్టీలో కొనసాగుతామని సైతం చెప్పలేదని సమాచారం.

ఎంత మంది మిగులుతారు?

మండలిలో బీఆర్ఎస్ సంఖ్యను తగ్గించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండటంతో.. 29 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో కనీసం పది మందైనా మిగులుతారా? లేదా అనే సందేహాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

వరంగల్ జిల్లాలో పరిస్థితి

వ‌రంగ‌ల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న ఆరుగురు బీఆర్ఎస్ నేత‌లు సైతం కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే మారిన రాజ‌కీయ ప‌రిస్థితులు, ప‌రిణామాల నేప‌థ్యంలో పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌ కోసం పార్టీ మారేందుకు వీరు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత బీఆర్ఎస్ తీరును.. టికెట్ల కేటాయింపును వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ బ‌హిరంగంగానే త‌ప్పుబ‌ట్టారు. ప్రస్తుతం త‌న స్థానిక నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్‌కు కంచుకోట‌గా మార‌డంతో బీఆర్ఎస్‌ను వీడి హస్తం పార్టీలో చేరాలని ఆయనపై అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.

ఇలాగే మ‌రో ఎమ్మెల్సీపైనా అనుచ‌రుల ఒత్తిడి ఉన్నట్టు టాక్. కాంగ్రెస్‌లోకి వ‌స్తే భ‌విష్యత్ రాజ‌కీయ అవ‌కాశాల‌పై హామీ ల‌భిస్తుంద‌ని రేవంత్‌కు స‌న్నిహితుడైనా ఓ ఎమ్మెల్యే.. స‌ద‌రు ఎమ్మెల్సీకి చెప్పినట్టు స‌మాచారం. మ‌రో ఎమ్మెల్సీ సైతం ఇద్దరు మంత్రుల‌తో అత్యంత స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉండ‌టంతో ఆయన కూడా పార్టీ మారే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మిగ‌తా ఎమ్మెల్సీలు సైతం ఆచితూచి అడుగు వేసే ధోర‌ణితో ఉన్నట్లు స‌మాచారం.


Similar News