సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. ఈనెల 19న భూమిపూజ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో గుడి కట్టబోతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో గుడి కట్టబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం కీలక ప్రకటన చేసింది.నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలలో ఈ గుడి నిర్మిస్తారమని మార్చి 19వ తేదీన గుడి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేయనున్నట్లు రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ ప్రకటించారు. ఈ కార్యక్రమం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ రెడ్డి అని, దేవుడిలా తమ కోరికలను రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడని అందువల్లే ఆయనకు గుడి కట్టబోతున్నట్లు చెప్పారు. ప్రజల బాగోగులు చూస్తున్న రేవంత్ రెడ్డే తెలంగాణ దేవుడని, ఇలాంటి కారణ జన్ముడికి గుడి కట్టడం తమ అదృష్టం అని చెప్పారు. భూమి పూజ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
గతంలో కేసీఆర్ కు సైతం:
కాగా గతంలో సినీ తారలనే దేవుడిగా భావించే అభిమానులు ఇటీవల కాలంలో రాజకీయనాయకులకు సైతం దేవుడిలా ఆరాధిస్తున్నారు. కాగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో పాటు మాజీ సీఎం కేసీఆర్ కు, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్సార్, ఎన్టీఆర్ లకు సైతం అభిమానులు గుడులు నిర్మించి పూజలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డికి సైతం గుడి నిర్మిస్తామని రెడ్డి సంఘం ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది.
రేవంత్ రెడ్డి క్రేజ్:
సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు తనదైనా మార్క్ పరిపాలనతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి ఇటీవలే దేశవ్యాప్తంగా పాపులర్ లీడర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇటీవలే ఇండియన్ ఎక్స్ ప్రెస్ దేశ వ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది జాబితాలో రేవంత్ రెడ్డికి చోటు లభించిన సంగతి తెలిసిందే.