TG Police : జైనూర్‌లో ప్రశాంతం.. ఆ విషయంపై రెచ్చగొట్టే ప్రకటనలు వద్దు: తెలంగాణ పోలీస్ హెచ్చరికలు

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ పట్టణంలో బుధవారం హింసాత్మక ఘటనలు జరగడంతో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-05 14:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ పట్టణంలో బుధవారం హింసాత్మక ఘటనలు జరగడంతో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఓ ఆటో డ్రైవర్ అక్కడి గిరిజన మహిళపై లైంగిక దాడి చేశాడనే నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జైనూర్ పట్టణంలో ఇంటర్నెట్ నిషేధం కూడా విధించారు. ఫేక్ వార్తలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీస్‌లు ఉద్రికత్తల వాతావరణంపై అప్డేట్ ఇచ్చారు. కొమురంభీమ్ జిల్లా జైనూర్ లో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉందని తెలిపింది.

ఆ ప్రాంతంలో ప్రశాంతతను నెలకొల్పేందుకు, స్థానికులలో మనోధైర్యం కలిగించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అత్యంత సున్నితమైన ఈ అంశంపై వివిధ సామాజికవర్గాలను రెచ్చగొట్టే విధంగా ఎలాంటి సామాజిక, రాజకీయ ప్రకటనలు చేయరాదని స్పష్టం చేసింది. అలాగే సోషల్ మీడియాలో కానీ అనధికారిక సమాచారం లేదా ఊహాగానాలు లేదా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినట్టయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల వారు పోలీస్ శాఖకు తోడ్పాటు నందించి జైనూర్ ప్రాంతంలో శాంతి భద్రతలు బాగుండేలా, అక్కడి ప్రజల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలా సహకరించాలని పోలీస్ శాఖ కోరుతోంది.


Similar News